Gita Jayanti 2024

Gita Jayanti 2024: భగవంతుని గీతామృతం అర్ధం చేసుకుంటే బతుకు గీత మారుతుంది!

Gita Jayanti 2024: మాసాల్లో మార్గశిరాన్ని నేనే అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు… దేవదేవునికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలోని  శుక్ల పక్ష ఏకాదశికి ఎంతో ప్రాధాన్యముంది… ఈ రోజునే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతాబోధ చేశారనీ ప్రతీతి… అందుకే మార్గశిర శుద్ధ ఏకాదశిన గీతాజయంతిని జరుపుకోవడం ఆచారం…

శ్రీమన్నారాయణుని లీలావినోదంతోనే సకల చరాచరసృష్టి సాగుతోంది… ధర్మసంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు అనేక అవతారాలెత్తాడు… ధర్మాన్ని నిలిపాడు… శ్రీకృష్ణావతారంలో  లోకానికి గీతనూ బోధించాడు… ఆ బోధలు ఈ నాటికీ భక్తకోటిని పావనం చేస్తూనే ఉన్నాయి…

దేవదేవుడు ఏది చేసినా అందులో ఓ పరమార్థం ఉంటుంది… సమీపబంధువు అయినా జూదంలో పాండవులను దేవుడు గెలిపించలేదనే వారూ ఉన్నారు… అయితే వారేమీ శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పి జూదం ఆడింది లేదు… పైగా పందెంలో ముందుగా తాను ఓడిపోయి, తరువాత ద్రౌపదిని పందెం పెట్టాడు ధర్మరాజు… ఆ భక్తురాలి ప్రార్థన ఆలకించి మానసంరక్షణ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ… తనను తలచిన వారిని ఆదుకోకుండా ఉండడు పరమాత్మ… ఈ సత్యం తెలియని వారే ఆ ఆపద్బాంధవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు…

ద్రౌపదీ మానసంరక్షణ చేసిన తరువాతయినా  శ్రీకృస్ణ పరమాత్మ మహత్తును గుర్తించలేక పోయాడు ధర్మజుడు… మరోమారు కూడా కృష్ణునికి తెలుపకుండానే పాచికలాడి ధర్మజుడు పరాజితుడయ్యాడు… ఆ పై నియమం ప్రకారం పన్నెండేళ్ళు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేసి వచ్చారు పాండవులు… అప్పుడు వారు కోరగానే కురుసభకు రాయబారిగా వెళ్ళి సంధి కోసం యత్నించాడు పరమాత్మ…  కానీ, దుష్టులైన కౌరవులు పరమాత్మనే పడగొట్టాలని ప్రయత్నించారు… అప్పుడే ఒక్క చూపుతో యావత్ కురుసేనను భస్మం చేయగలడు శ్రీకృష్ణుడు… కానీ, ఎవరి చావు ఎవరి చేత రాసి ఉందో అదే తీరున సాగాలని భావించాడు కృష్ణయ్య… 

ఇది కూడా చదవండి: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ విలాసవంతమైన బంగ్లా.. బీజేపీ విమర్శల దాడి

Gita Jayanti 2024: కురుపాండవ సమరం ఆరంభ సమయాన అర్జునునికి శ్రీకృష్ణుడు చేసిన బోధనే గీత. బంధుమిత్రాదులను చంపి, వారి రక్తతర్పణంతో సిద్ధించే రాజ్యం వలదని అస్త్రసన్యాసం చేశాడు అర్జునుడు. ఆ సమయంలో పరమాత్మ పార్థునికి చేసిన బోధనే భగవద్గీతగా భాసిల్లుతోంది… భగవద్గీత పరమపవిత్రం… గీతాపారాయణ పఠితులను పవిత్రులను చేయక మానదు… మానవజీవనం ధర్మమార్గంలో సాగడానికి పలు సూత్రాలను శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించాడు. 

యుద్ధం చేయనని అహింసా మార్గాన్ని ఎంచుకున్న అర్జునునికి శ్రీకృష్ణుడు హింస చేయమని బోధిస్తాడా? అని పలువురు మూర్ఖులు ప్రశ్నిస్తున్న రోజులివి. కానీ, కృష్ణ పరమాత్మ తత్త్వం తెలియని మూఢులు ఆ తీరున మాట్లాడవచ్చు.  అంతర్ దృష్టితో గమనిస్తే పరమాత్మ ఎందుకు ఆ రణభూమినే ఎంచుకొని గీతను బోధించాడో అర్థమవుతుంది.

ఆత్మ సత్యం. అది నిత్యం. దానికి చావు లేదు. ఓ తనువు నుండి మరో తనువుకు మారుతుందే తప్ప మరణం పొందదు. తనువుతో అవతరించిన ప్రతీజీవి మంచి,చెడులతో జీవనం సాగించవలసిందే. జీవన పోరాటం జరుపవలసిందే. ఆ పోరాటాన్ని మధ్యలో వదిలివేస్తే జన్మకు సార్థకత సిద్ధించదు. సత్యమైన ఆత్మ ప్రస్తుత శరీరాన్ని వీడేంత వరకు పోరాడాల్సిందే. అదే అసలు రహస్యం. 

Gita Jayanti 2024: జీవిత పరమార్థం ఏంటో  బోధించడానికే పరమాత్మ పవిత్ర స్థలమైన కురుక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. మంచిచెడ్డలకు ప్రతీకలుగా కురుపాండవులను చూపించాడు. మంచిని గ్రహించి, చెడును వీడవలెనని బోధించాడు. అందుకు జీవన పోరాటం చేస్తూనే ఉండాలన్న సత్యాన్ని మానవాళికి అందించాడు. చేసేవాడు – చేయించెడివాడు – అన్నీ తానేనని చాటాడు… 

పరమాత్మ గీతలోని అసలు సత్యాన్ని గ్రహించని వారే వింతవాదనలు చేస్తూంటారు…  పరమపవిత్రమైన గీతను విమర్శిస్తూంటారు. అలాంటి వారు సైతం భగవద్గీతను పదే పదే పఠించినట్టయితే, పరమాత్మ తత్త్వం బోధ పడుతుంది. అసలైన జీవం ఏమిటో అర్థమవుతుంది. మన కనులకు అసలైన వెలుగు ఏమిటో అవగతమవుతుంది.

ALSO READ  Basara: బాసర లో ఘనంగా దసరా ఉత్సవాలు

భగవద్గీతను సరైన రీతిలో అర్థం చేసుకున్న వారు… ఆ కన్నయ్యపైనే భారం వేసి జీవితం సాగిస్తూంటారు… వారికి అన్నిటా శుభాలే సమకూరుతుంటాయి… ఈ సత్యం తెలిసిన వారు తమ జీవితాల్లోకీ కృష్ణయ్యను ఆహ్వానించకుండా ఉండలేరు… అదే కృష్ణ పరమాత్మ లీల! ఈ నాటికీ భక్తకోటి తమ కష్టాలను తీర్చమని కృష్ణయ్యను వేడుకుంటూనే ఉండడం చూస్తూనే ఉన్నాం… 

దేవదేవుని మాయతోనే మనిషికి కష్టసుఖాలు… ఆ మాయను ఛేదించే మార్గమే భగవద్గీత… దర్మాచరణకు సులువైన దారి… అదే లోకానికి బోధించాడు మురారి… కృష్ణతత్త్వం తెలుసుకున్నవారికి ఆనందం అనునిత్యం … ఇది జగమెరిగిన సత్యం!

Gita Jayanti 2024: పుట్టినవాడు గిట్టక మానదు – గిట్టినవారు పుట్టక మానరు అంటూ జన్మబంధాల గురించి తెలిపాడు కృష్ణ పరమాత్మ… అయితే ఈ జన్మబంధాలే లేకుండా పరమాత్మలో లీనమయ్యే మార్గాన్నీ గీతలో బోధించాడు శ్రీకృష్ణుడు… అందుకే మరల జన్మమెత్తకుండా ఉండే మార్గం గీతలోనే మనకు లభ్యమవుతుంది… ఆత్మ తత్త్వాన్ని మనకు తెలియజెప్పింది కూడా గీతనే!… 

ధర్మం నశించిన ప్రతీసారి పరమాత్మ ఓ అవతారమెత్తి, ధర్మసంస్థాపన చేశాడు… ఆయన నెలకొల్పిన ధర్మాన్ని ప్రతి మనిషి పాటించినట్లయితే, ధర్మం నాలుగు పాదాల మీదే నడుస్తూ ఉంటుంది.. సకలం మాకే కావాలనుకొనే స్వార్థమానవుల కారణంగానే అధర్మం తాండవిస్తుంది…  అందుకు ప్రతీక దుర్యోధనాదులు. మాట కోసం కట్టుబడి వనవాసం, అజ్ఞాత వాసం చేసిన పాండవులు ధర్మనిరతులు. ఈ మంచిచెడ్డలకు మధ్య పోరాటమే కురుక్షేత్రం. ఇదే విషయాన్ని  ఎవరికి వారు తమ జీవితాలకు అన్వయించుకుంటే ధర్మమే నిలుస్తుందని పరమాత్మ బోధ చేశాడు. అదే భగవద్గీత సారాంశం.

అర్జునునికి కలిగిన విచారం లాగే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక రోజు మాయాచిత్తుడై  ఏది పుణ్యమో, ఏది పాపమో తెలియని తికమకలో పడతాడు. అలాంటి వారికి కృష్ణ పరమాత్మ ఒకే ఒక సత్యాన్ని బోధించాడు. అన్ని ధర్మములూ వదలి, ఆ పరమాత్మనే నమ్ముకుంటే అసలైన ధర్మమేదో గోచరిస్తుంది. అప్పుడే ఏది తప్పో, ఏది ఒప్పో తేలిపోతుంది. ఆ  జ్ఞానం సంపాదించేందుకు సులువైన మార్గం భగవద్గీతను అర్థం చేసుకోవడమే…

ఇది కూడా చదవండి: Asaram Bapu: ఆశారాంకు మూడోసారి పెరోల్

Gita Jayanti 2024: నారాయణ లీల నవరసభరితంగా ఉంటుంది. ఆ లీలను తెలుసుకొన్నవారి జీవితం పావనం. భీష్మాదులు, విధురుడు, అక్రూరుడు మొదలైన భక్త శిఖామణులు మానుషరూపంలో ఉన్న శ్రీకృష్ణుడే పరమాత్మ అన్న సత్యాన్ని గ్రహించారు. అందుకే అభిమానించారు. ఆరాధించారు. ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ దివ్యమోహన రూపాన్ని దర్శించుకోలిగారు.

పరమపావనులకే పరమాత్మ కటాక్షం ఉంటుందని ఊరుకోరాదు. నిజానికి పరమాత్మ  మన నుండి కోరేది నిండుమనసే. అందుకే నిండుమనసే నీ పూజ… అనీ కీర్తనలు వెలిశాయి. భక్తితో ఏమిచ్చినా తీసుకొని సంతృప్తి చెందే భక్తసులభుడు పరమాత్మ. ఫలం, పత్రం, పుష్పం, తోయం ఏమిచ్చినా స్వీకరిస్తానని భగవానుడు గీతలో బోధించాడు. అదే తీరున కృష్ణమూర్తి సాగాడు. ఆ లీలలు తలచినంతనే మది పులకించిపోవలసిందే.

ద్వాపరయుగంలో సాగిన శ్రీకృష్ణుని వేణుగానాన్ని ఈ నాటికీ తలచుకొని పులకించిపోతున్నారు భక్తులు…  సర్వకాల సర్వవ్యవస్థల్లో వినిపించేది నాదమే… ద్వాపరంలోని వేణుగానం ఈ నాటికీ వినిపిస్తుందా? అనే మూఢులకు ఆ గీతా నాదమే సమాధానం చెబుతుంది… అదే తీరున యుద్ధభూమిలో బోధించిన గీత మన జీవనసమరాన్ని సులువుగా గెలిచే మార్గం చూపిస్తూ సాగుతోంది… ఈ సత్యాన్ని తెలుసుకున్న వారికి నిత్యానందం సొంతం కాక మానదు… తమ జీవితాలను పరమాత్మకు అంకితం చేసిన వారిని ఆ దేవదేవుడే రక్షించక మానడు…

ALSO READ  Union Minister Daughter: వార్నీ.. ఎంత ధైర్యం? ఏకంగా మంత్రి కూతురిపైనే లైంగిక వేధింపులు..

ఏకాదశి విష్ణువు, శివుడు ఇద్దరికీ ప్రియమైనది… అందుకే ఈ తిథి వైష్ణవులకు, శైవులకు పరమపవిత్రం… ఈ పవిత్ర దినాన భగవద్గీత పారాయణమూ పుణ్యప్రాప్తి ప్రసాదిస్తుంది… అందునా మార్గశిర శుద్ధ ఏకాదశిన భగవద్గీతను ఫఠిస్తే మరింత పుణ్యం లభిస్తుందని భక్త కోటి విశ్వాసం… 

ఏకాదశి పూట ఎందరో భక్తులు ఉపవాస దీక్ష పాటించడం ఈ నాటికీ గమనిస్తున్నాం. ప్రతి నెలలోనూ శుక్ల పక్షంలో ఓ ఏకాదశి, కృష్ణ పక్షంలో మరో ఏకాదశి ఉంటాయి. అలా నెలకు రెండు ఏకాదశుల చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు… వాటిలో మార్గశిరాన వచ్చే శుద్ధ ఏకాదశినే గీతా జయంతిగా నిర్వహిస్తున్నారు. ఆ రోజున మరింత భక్తి ప్రపత్తులతో గీతాధ్యయనం చేస్తూంటారు భక్తులు… గీతా పూజ చేసిన ముల్లోకాలు చుట్టివచ్చినంత పుణ్యం అనీ భక్తుల విశ్వాసం!… కృష్ణ భక్తులకు మరింత ప్రత్యేకం మార్గశిర శుద్ధ ఏకాదశి… ఆ రోజున కృష్ణాలయాల్లో సాగే గానం విన్నా పుణ్యం దక్కుతుందని ప్రతీతి… 

Gita Jayanti 2024: సత్యకాలం నుంచీ ఏకాదశి పవిత్రత కొనసాగుతోంది. మందరపర్వమథనంలో ఉద్భవించిన విషాన్ని శివుడు గళంలో నిలిపాడు. ఏకాదశి రోజునే వెలసిన సుధను రాక్షస మూకలకు అందకుండా మోహినీ రూపధారియై మాయచేశాడు విష్ణువు… అమృతాన్ని దేవతలకు దక్కేలా చేశాడు … ఆ కథను మననం చేసుకున్నా జన్మ పావనమవుతుంది…

మార్గశిర ఏకాదశి రోజునే ధనుర్ధారులై సమరానికి సన్నద్ధమయ్యారు కురుపాండవులు. పలు యాగాలు చూసిన పుణ్యస్థలమైన కురుక్షేత్రాన్ని సమరభూమిగా ఎంచుకున్నారు. అక్కడ ఓడినవారికి, గెలిచిన వారికి కూడా పుణ్యఫలమే దక్కుతుంది. అలాగే ఆ చోట మరణించిన వారికీ, విజేతలకూ, పరాజితులకూ స్వర్గప్రాప్తి తథ్యం. ఈ విషయాలన్నీ తెలిసే కురుక్షేత్రాన్ని రణక్షేత్రంగా ఎంపిక చేశారు. ఆ ధర్మక్షేత్ర మహిమ తెలిసిన భీష్మాదులు కౌరవులకు అలాగైనా పుణ్యలోకప్రాప్తి లభిస్తుందని ఆశించే యుద్ధానికి సిద్ధమయ్యారు. 

ఎన్నో రీతుల యోచించే కురుపాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని సమరసీమగా ఎంచుకున్నారు… అలా పలు కోణాల్లో ఆలోచిస్తే మన మనసును మించిన కురుక్షేత్రం ఏదీ ఉండదని తేలిపోతుంది. అప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది. అది తెలుసుకున్న పార్థునికి అనితరసాధ్యమైన విశ్వరూప సందర్శన ప్రాప్తి కలిగింది. అంటే, భగవత్ లీల తెలిసిన వారికి పరమానందం కలుగుతుందని భావం.

Gita Jayanti 2024: గీతాసారం మనకు బోధపడితే, ప్రతి అణువులోనూ పరమాత్మనే ఉన్నాడన్న సత్యం గ్రహిస్తాం. అణువూ అణువున పరంధాముడున్నాడన్న పరమసత్యం తెలియడమే అసలు సిసలు జ్ఞానం. అందుకు మార్గం చూపించేదే భగవద్గీత.  మార్గశిర ఏకాదశిన గీతాజయంతిని సైతం జరుపుకుంటూ పరమాత్మ తత్త్వం తెలిసిన వారికి ఇహంలోనే పరం లభిస్తుందనీ చెప్పవచ్చు. . కావున భక్తజనులు పరమపావనమైన గీతను పవిత్ర దినమైన ఏకాదశిన పఠనం చేసినా, మననం చేసుకున్నా, ఆ లీలామూర్తి లీలలు తలచుకున్నా మన జన్మలు పావనం కాకమానవు.

యుగయుగాలుగా తరతరాలుగా గీత మన జీవనవిధానంలో భాగమయింది. గీతా పఠనంతోనూ, గీతాధ్యానంతోనూ సకల సుఖాలు మన సొంతమవుతాయి. భయంకరవ్యాధులను పారద్రోలడానికి, కఠిన పరిస్థితులను సైతం అధిగమించడానికి మనకు మార్గం చూపే సాధనం – భగవద్గీత…  పరమపావనమైన భగవద్గీతనే మనకు రక్ష… గీతను సదా స్మరిద్దాం… తరిద్దాం…

గీతను పఠిద్దాం… గీతను సదా స్మరిద్దాం… గీతతోనే తరిద్దాం… భగవద్గీతను మన జీవితంలో భాగంగా చేసుకుందాం… ఓం తత్ సత్..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *