MG Windsor EV Pro : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ తాజాగా తన విజయవంతమైన ఎలక్ట్రిక్ మోడల్ విండ్సర్‌కు నూతన రూపాన్ని ఇచ్చింది. MG Windsor EV Pro పేరుతో విడుదలైన ఈ కొత్త వెర్షన్ మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, దీర్ఘ ప్రయాణ రేంజ్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా తయారైంది.
విండ్సర్ స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే ప్రో మోడల్‌లో మరింత శక్తివంతమైన 52.9 kWh బ్యాటరీని అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది సుమారు 448 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది మునుపటి మోడల్ కంటే 100 కి.మీ. ఎక్కువ. మోటార్ విషయంలో మార్పు లేదు – ఇది 136 హెచ్‌పీ పవర్, 200 ఎన్‌ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
వాహనంలో ట్రాఫిక్ జామ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లెవల్ 2 ADAS, వాహనానికి వాహనం పవర్ షేరింగ్, వాహనం నుంచి ఇతర డివైజులకు పవర్ పంపించే వీలుతో Vehicle-to-Load (V2L) వంటి ఫీచర్లు జోడించారు. గత మోడల్‌లో లేనివి ఇవి. బాహ్యంగా కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, సెల్డాన్ బ్లూ, ఆరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అంతర్గతంగా వెంటిలేటెడ్ సీట్లు, 604 లీటర్ బూట్ స్పేస్, చెక్క ఫినిషింగ్, LED హెడ్‌టైట్లు, టెయిల్‌లైట్లు, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Delhi: మే 10న పాకిస్తాన్ పై ఇండియా దాడి
MG Windsor EV Pro : విండ్సర్ EV ప్రోను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు – ఒకటి బ్యాటరీ అద్దె (BaaS) మోడల్, మరొకటి బ్యాటరీతో కూడిన మోడల్. BaaS వేరియంట్ ప్రారంభ ధర రూ. 12.50 లక్షలు, బ్యాటరీతో కూడిన మోడల్‌కి ఎక్స్‌షోరూమ్ ధర రూ. 17.49 లక్షలు. ఈ ధర మొదటి 8,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. బుకింగ్‌లు మే 8, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.
సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ వాహనంలో ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ అంకరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. విండ్సర్ EV ప్రో అన్ని కోణాల్లోనూ ఒక సంపూర్ణ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ SUVగా నిలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ ద్వారా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని చూస్తోంది.