Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతూ కోస్తాంధ్ర వైపు దూసుకువస్తోంది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని, ప్రజలు–అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ ప్రకారం, మంగళవారం కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని అంచనా. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో అత్యధికంగా 73 మిల్లీమీటర్లు,
మన్యం జిల్లా గుళ్లసీతారామపురంలో 66 మి.మీ,
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 60.2 మి.మీ,
అల్లూరి జిల్లా కొత్తూరులో 59.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.