L&T: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ, తమ వాటాలను విక్రయించి ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది. దీనికి ప్రధాన కారణం భారీగా పెరుగుతున్న ఆర్థిక నష్టాలనని తెలుస్తోంది. L&T మెట్రో రైలు ప్రాజెక్టులో ఇప్పటివరకు సుమారు ₹6,600 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే ₹626 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రాజెక్టు ప్రారంభంలో తీసుకున్న దాదాపు ₹13,000 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడం, దానిపై వడ్డీ భారం పెరిగిపోవడంతో L&T తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
ఇది కూడా చదవండి: Jagan vs Lokesh DSC: వైసీపీ నేతల ఫిల్తీ కాన్ఫిడెన్స్‌ని మట్టికరిపించిన లోకేష్
ప్రాజెక్టు నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్థిక సాయం, లేదా ఇతర మద్దతు ఇవ్వాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను L&T కోరింది. కానీ, ఆశించినంత సహకారం లభించలేదని సంస్థ ఆరోపిస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో 169 రోజుల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడం వల్ల ₹382 కోట్ల నష్టం వచ్చిందని L&T పేర్కొంది. వర్క్ ఫ్రం హోమ్ విధానం కొనసాగుతుండడం, ప్రయాణికుల సంఖ్య ఆశించినంతగా పెరగకపోవడంతో టికెట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణలో కూడా పాల్గొనలేమని, తమకు ఉన్న వాటాలను ప్రభుత్వమే కొనుగోలు చేయవచ్చని L&T కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో, L&T తన వాటాలను అమ్మేసి ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలగాలని చూస్తోంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.