Olympics: ఒలింపిక్స్ లో పతకం కాదు..ఒలింపిక్స్ లో పాల్గొనడమే గొప్ప గౌరవం అంటారు. అలాంటిది ఇప్పుడు మనం విశ్వ క్రీడలనే నిర్వహించేందుకు సిద్ధమౌతున్నాం. ఇప్పటిదాకా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో అనధికారికంగానే ఈ ప్రతిపాదనపై చర్చిస్తూ వచ్చిన భారత్.. ఇప్పుడు అధికారికంగా తన ఆసక్తిని తెలియజేస్తూ.. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు రెడీ అని ఐఓసీ భవిష్యత్ ఆతిథ్య కమిషన్‌కు భారత్ లేఖ ఇచ్చింది.
Olympics: ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబురం ఒలింపిక్స్.. దీని నిర్వహణకు ఎప్పట్నుంచో ఆసక్తితో ఉన్న భారత్.. 2036లో ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం 2036 ఒలింపిక్స్ నిర్వహణకు రెడీ అని అక్టోబరు 1నే ఈ లేఖను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ).. ఐఓసీకి పంపింది. ఆర్థిక, సామాజిక ప్రగతితో పాటు దేశవ్యాప్తంగా యువత అభ్యున్నతికి ఒలింపిక్స్ మంచి అవకాశమని ఈ లేఖలో ఐఓసీ కి తెలిపింది. గత ఏడాది తొలిసారి 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వడంపై పీఎం నరేంద్ర మోదీ మాట్లాడారు. అప్పట్నుంచి భారత ప్రతినిధులు ఐఓసీతో అనధికారికంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్ సందర్భంగానూ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలోని బృందం పారిస్‌కు వెళ్లి ఐఓసీతో ఒలింపిక్స్ ఆతిథ్యంపై మాట్లాడింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ సైతం భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడంపై సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. భారత్ 2010లో కామన్వెల్త్ క్రీడలను ఘనంగా నిర్వహించి తన సత్తాను ప్రపంచానికి తెలిపింది. ఆ క్రీడలకు దిల్లీ వేదికగా నిలవగా.. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం వస్తే అహ్మదాబాద్‌ను వేదికగా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐఓసీ ఎన్నికలు జరగనుండగా.. ఆలోపు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉండదు.
Olympics: 2028 ఒలింపిక్స్‌కు అమెరికా దేశంలోని లాస్ ఏంజెలెస్, 2032 క్రీడలకు ఆస్ట్రేలియా దేశంలోని బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం మనదేశంతో సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే కూడా పోటీలో ఉన్నాయి. ఈ దేశాల పోటీని తట్టుకుని ఆతిథ్య హక్కులు పొందాలంటే భారత్ గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. అత్యున్నత క్రీడా సౌకర్యాలు కల్పిస్తామనే భరోసా ఇవ్వడంతో పాటు ఆర్థిక బలాన్ని, నిర్వహణ సామర్థ్యంతో పాటు ఆదాయం వస్తుందని ఐఓసీకి చాటాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ నిర్వహణపై ఇప్పటికే ఐఓఏ.. క్రీడా మంత్రిత్వ శాఖకు ఒక నివేదికను సమర్పించింది. భారత్‌కు ఆతిథ్య అవకాశం దక్కితే క్రీడల్లో యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, క్రికెట్ లను చేర్చేలా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

