Vangalapudi anitha: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పూ లేదని ఆమె అన్నారు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంతో మాట్లాడారో తెలుసని, త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని అనిత చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రికి అన్నీ విషయాలు తెలుసని, ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పూ లేదని అనిత చెప్పారు. ఏపీలో శాంత్రిభద్రతల విషయమై సీఎం చంద్రబాబు, తాను పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఆ చర్చల్లో పవన్ కూడా భాగమేనని అన్నారు.
ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తున్నారు..
పిల్లలపై లైంగికదాడులు జరగడంపై ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం నాడు పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదని మండిపడ్డారు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను హోంశాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

