Vallabhaneni Vamsi: మొన్న ఫిబ్రవరి 18 విజయవాడ సబ్‌జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్, బయటకొచ్చి ఓ సెటైరికల్ బాంబు పేల్చారు. “మా వంశీ అందగాడు కాబట్టే కూటమి సర్కారు టార్గెట్ చేసి అరెస్ట్ చేసింది!” అంటూ మాట్లాడారు. ఈ డైలాగ్ విన్నవాళ్లు ముందు నవ్వుకున్నారు, కానీ నెల తిరక్కుండానే జగన్ చెప్పిన ఆ “అందగాడి” పరిస్థితి చూసి అందరూ షాక్ అయ్యారు. తాజాగా మంగళవారం కోర్టు వాయిదాకు జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ, నీరసంగా, ముక్కుపై గాయంతో, ఆయింట్‌మెంట్ పూసుకుని కనిపించాడు. “అందం” మాటేమో కానీ, “ఆపద”లో ఉన్నట్లు మాత్రం చూసిన వాళ్లకి ఇట్టే అర్థమైపోతుంది.
ఒకప్పుడు టీడీపీ నుంచి గన్నవరంలో గెలిచి, 2020లో వైసీపీలో చేరిన వల్లభనేని, జగన్‌కు వీరాభిమానిగా మారారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో, దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించాడన్న ఆరోపణలతో ఫిబ్రవరి 13న అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు విజయవాడ సబ్‌జైలులో కాలం గడుపుతున్నారు వంశీ. జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉంటున్న వంశీ.. గతంలో తాను ఒంటరిగా ఉండలేక పోతున్నాననీ, తన హెల్త్ కండీషన్, మెంటల్ కండీషన్ బాగోలేవనీ, తనకు తోడుగా ఓ మనిషిని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అప్పటి నుండే వంశీ అనారోగ్య సమస్యలు బయటకు రావడం మొదలైంది. ఈ కారణంతోనే ప్రత్యేక వసతుల కోసం పిటిషన్ వేశారు. ఇప్పుడు, ముక్కుపై గాయం, ఆయింట్‌మెంట్‌తో కనిపించడం చూస్తే.. వంశీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.
Also Read: Byreddy: వైసీపీ.. “పదవుల ఫ్యాక్టరీ”!
Vallabhaneni Vamsi: తమ పార్టీలో అందగాళ్లంతా టార్గెట్ అవుతున్నారని జగన్ వేసిన జోక్స్.. ఇప్పుడు బూమరాంగ్ అవ్వడం చూసి సోషల్‌మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వంశీ జైలులో నీరసంగా కనిపిస్తుంటే.. ఇక అందం ఎక్కడుంది జగన్ బాస్? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు నెటిజన్లు. ఒకప్పుడు కొడలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ వంటి లీడర్లకు… పొలిటికల్ తెరపై ఉన్న గ్లామరే వేరు. ఆ గ్లామర్ చూసుకునే… పొలిటికల్ ప్రత్యర్థులపై బూతులతో రెచ్చిపోయారు. ఇప్పుడు అంతా కట్టకట్టుకుని ఓడిపోవడంతో… కేసుల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. ఇక వల్లభనేని వంశీ విషయానికొస్తే.. జగన్ కితాబిచ్చిన అందానికి ఆయింట్‌మెంట్ పూసుకోవాల్సిన పరిస్థితి. “అందగాడు” ట్యాగ్‌తో జగన్ ఎంత హైప్ ఇచ్చినా, ఇప్పుడు వంశీ పరిస్థితి చూస్తే – “అందం కంటే ఆరోగ్యం ముఖ్యం బాస్!” అని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.
మొత్తానికి జగన్ చెప్పిన అందగాళ్లు జైలులో ఆయింట్‌మెంట్ రాసుకుంటూనో, ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనో కనిపిస్తుంటే… వైసీపీ అందం కూడా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికొచ్చిందని ఏపీ రాజకీయ రంగస్థలంలో పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయ్.