Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఖీర్‌గద్, ధారళి గ్రామాలను వరదనీరు పూర్తిగా ముంచెత్తింది. ఈ ఘటనలో 60 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు.
ఖీర్ గంగా నది ఉగ్రరూపం
ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి, ఒక్కసారిగా గ్రామాలను ముంచెత్తింది. వరద ప్రవాహం ఎంత తీవ్రంగా ఉందంటే, అనేక ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
సహాయక చర్యలు ముమ్మరం
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇండియన్ ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి స్వయంగా సీనియర్ అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
క్లౌడ్ బరస్ట్, కొండచరియలు
హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రి పరిధిలోని ధరావలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో కొండచరియలు విరిగిపడి గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీని వల్ల పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. హెలికాప్టర్లు, స్థానిక వనరులతో రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కొండచరియల కింద చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హెచ్చరికలు, అప్రమత్తత
ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, ముఖ్యంగా యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం, సహాయక బృందాలు కలిసి ప్రజలను రక్షించడానికి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
A massive flash flood swallows houses in #Uttarkashi as people scream in fear. As per authorities many people feared trapped.@ukcmo #Uttarkhand #Cloudburst#Rainfall#Himalaya pic.twitter.com/Ja8qVzGtL7
— The Environment (@theEcoglobal) August 5, 2025