Upendra UI Teaser: కాస్తంత గ్యాప్ తర్వాత తిరిగి ‘యుఐ ది మూవీ’ కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు నట దర్శకుడు ఉపేంద్ర. ఈ సినిమాను కె.పి. శ్రీకాంత్ నిర్మిస్తుండగా, నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్నర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇరవై యేళ్ల తర్వాత అంటే 2040లో జరిగే కథ ఇది. సమాజం రకరకాల కారణాలతో విచ్ఛిన్నం, విధ్వంసం దిశగా సాగుతున్న సమయంలో మార్పుకోసం నియంతగా అడుగుపెడతాడు ఉపేంద్ర. మార్పు కోసం ఉద్యమం చేసే వర్గాలతో ఉపేంద్ర ఎలా ప్రవర్తించాడు అనేది ఇందులో చూపించారు. ఉపేంద్ర మార్క్ కొత్తదనంతో ఈ గ్లింప్స్ ఉండటం విశేషం. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రీష్మా నానయ్య, మురళీశర్మ, సన్నీ లియోన్, నిధీ సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న జనం ముందుకు రాబోతోంది.

