Telangana: టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమయం దగ్గర పడుతున్నది. మరోవైపు అభ్యర్థుల ఆందోళన తీవ్రరూపం దాలుస్తున్నది. పలు అభ్యంతరాలపై పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్న డిమాండ్‌తో ఇన్నినాళ్లు న్యాయస్థానాన్ని నమ్ముకున్న అభ్యర్థులు ఎదురుచూస్తూ వచ్చారు. పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా రగిలిపోయారు. హైదరాబాద్ నగరంలోని అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం నుంచి నేటిదాకా వరుస ఆందోళనలతో ఆ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. గురువారం అర్ధరాత్రి కూడా అశోక్‌నగర్‌లో అభ్యర్థు లు అరెస్టు కొనసాగాయి.
Telangana: అభ్యర్థులు ఒకవైపు ఈ ఆందోళనలు నిర్వహిస్తూ మరోవైపు రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతున్నారు. తమ తప్పులు తెలుసుకున్నామని, తమకు మద్దతు ఇచ్చి న్యాయ జరిగేలా చూడాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పలువురు అభ్యర్థులు విన్నవించుకున్నారు. ఆయనను తెలంగాణ భవన్లో స్వయంగా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను గాంధీభవన్‌లో కలిసి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసేలా ఒప్పించాలని కోరారు. మరికొన్ని పార్టీల, సంఘాల నేతలను కలిసి అభ్యర్థులు మద్దతు కోరారు.
Telangana: రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటాయనే ఉద్దేశంతో అశోక్‌నగర్‌లో పోలీసులు మోహరించారు. నలుగురు గుమికూడితే ఆరా తీస్తున్నారు. అభ్యర్థులు కనిపిస్తే చెల్లాచెదురు చేస్తున్నారు. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. మహిళలని కూడా చూడకుండా వ్యాన్లలోకి గుంజిపడేసి స్టేషన్లకు తరలిస్తున్నారు.
Telangana: సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన అభ్యర్థితో పాటు మరో నలుగురు హైకోర్టులో రిల్ అప్పీలు దాఖలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జీఏడీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ అప్పీల్‌పై ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించనున్నది.
Telangana: ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిశీలించి తప్పులను తొలగించలేదని, ఆ తప్పులున్న ప్రశ్నలను తొలగించి, మళ్లీ మెరిట్ జాబితాను ప్రకటించేలా ఆదేశించాలని వారు కోరారు. తప్పుడు ప్రశ్నలను తొలగిస్తే మెరిట్ జాబితా మొత్తం మారిపోతుందని తెలిపారు. ఒకవైపు రోడ్లపై పోరుబాట, మరోవైపు న్యాయం కోసం ఆరాటం నడుమ అభ్యర్థులు నలిగిపోతున్నారు.

