TVK President Actor Vijay: మధురైలో జరిగిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండో రాష్ట్ర సమావేశంలో పార్టీ అధినేత విజయ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. “మన సిద్ధాంత శత్రువు బీజేపీ, రాజకీయ శత్రువు డీఎంకే. పోటీ స్పష్టంగా టీవీకే – డీఎంకేల మధ్యే జరుగుతుంది. 234 నియోజకవర్గాల్లో అభ్యర్థి ముఖం విజయ్‌దే” అని ఆయన ప్రకటించారు.
ఎఐఎడిఎంకేపై విజయ్ దాడి
విక్రవాండిలో జరిగిన మొదటి సమావేశంలో బీజేపీ, డీఎంకేలను తీవ్రంగా విమర్శించినా, ఎఐఎడిఎంకేపై నిశ్శబ్దం పాటించారు. దీంతో రాజకీయ విశ్లేషకులు “విజయ్‌కి ఎఐఎడిఎంకేతో పొత్తు చేసే అవకాశం ఉందా?” అని ఊహించారు. కానీ, మధురై సభలో విజయ్ ఆ అనుమానాలకు పూర్తిగా తెరదించారు.
“ప్రజల ప్రేమ, ఆశీస్సులు మన వెనుక ఉన్నప్పుడు, ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పార్టీ అయిన బీజేపీతో పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ మనం ఎందుకు కలవాలి? మా కూటమి ఆత్మగౌరవ కూటమి. అది ఆర్‌ఎస్‌ఎస్‌కు లొంగిపోయే, లౌకికత నాటకం ఆడే కూటమి కాద” అంటూ విజయ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: TVK Maanadu: విజయ్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట.. ఒకరు మృతి.. 400 మందికి అస్వస్థత
కార్యకర్తల బాధపై ఆవేదన
ఎంజీఆర్ పేరు ప్రస్తావించిన విజయ్, ఆయన రాజకీయ వారసత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. “ఎంజీఆర్‌కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఆయన వచ్చిన వెంటనే చరిత్ర రాశారు. అయితే ఆయన స్థాపించిన పార్టీ నేడు ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు. అమాయక కార్యకర్తలు తమ బాధను బయటపెట్టలేక ఇబ్బంది పడుతున్నారు” అని అన్నారు.
2026 ఎన్నికల సంకేతాలు
“ఆ పాపం చేయని కార్యకర్తలకు 2026 ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో తెలుసు. ప్రజాశక్తి మన వెనుక ఉన్నప్పుడు బీజేపీ ఏ వేషం వేసినా, వారి ఉపాయాలు తమిళనాడులో పనిచేయవు” అంటూ విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.