Trump

Trump: ట్రంప్‌ ఎక్కగానే ఆగిపోయిన ఎస్కలేటర్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైట్‌ హౌజ్‌

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంలో వరుస సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఘటనలు దౌత్యపరమైన వివాదంగా మారి, వైట్ హౌస్ దర్యాప్తుకు డిమాండ్ చేసింది.

సమావేశ వేదికకు వెళ్లేందుకు ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కారు. మెలానియా ముందుగా ఎక్కగా, ట్రంప్ వెనుక ఉన్నారు. అయితే, ట్రంప్ ఎక్కిన కొద్ది క్షణాల్లోనే ఎస్కలేటర్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో మెలానియా కాస్త అసహనంగా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్, ఆయన భద్రతా సిబ్బంది ఆగిన ఎస్కలేటర్‌పై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.

వైట్ హౌస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ సంఘటన “ఆమోదయోగ్యం కాదు” అని పేర్కొన్నారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్ ఉద్దేశపూర్వకంగా ఆపబడి ఉంటే, బాధ్యులైన వారిని తొలగించి, వెంటనే దర్యాప్తు జరపాలి అని ఆమె డిమాండ్ చేశారు. గతంలో కూడా ట్రంప్ వచ్చినప్పుడు యూఎన్ సిబ్బంది ఎస్కలేటర్‌లు, లిఫ్ట్‌లను ఆపడంపై జోకులు వేసినట్లు సమాచారం.

అయితే, యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎస్కలేటర్ భద్రతా యంత్రాంగం అధ్యక్షుడి ముందు ఉన్న వ్యక్తి వల్ల అనుకోకుండా కారణమై ఉండొచ్చని, కొన్ని నిమిషాల్లోనే దాన్ని సరిచేశామని వివరించారు. ఈ ఘటనలో ఎలాంటి హానికరమైన ఉద్దేశం లేదని యూఎన్ స్పష్టం చేసింది.

Also Read: Aadhaar Service Charges: అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు

ఎస్కలేటర్ ఘటన తర్వాత, జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగం సమయంలో మరో సమస్య తలెత్తింది. టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడంతో ట్రంప్ సహనానికి పరీక్ష ఎదురైంది. ప్రసంగం ప్రారంభంలోనే ఆయన ఈ విషయాన్ని హాస్యాస్పదంగా ప్రస్తావించారు. ఈ టెలిప్రాంప్టర్‌ను నిర్వహిస్తున్నవారు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారు అని ట్రంప్ అన్నారు. నేను ఏడు యుద్ధాలను ముగించాను, ప్రపంచ నాయకులతో వ్యవహరించాను, కానీ ఐక్యరాజ్యసమితి నుండి నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. నాకు లభించినది కేవలం చెడ్డ ఎస్కలేటర్, చెడ్డ టెలిప్రాంప్టర్ మాత్రమే అని సెటైర్లు వేశారు.

యూఎన్ ప్రతినిధులు టెలిప్రాంప్టర్ సమస్యకు తాము బాధ్యులం కాదని వివరించారు. అమెరికా అధ్యక్షుడి టెలిప్రాంప్టర్‌ను వైట్ హౌస్ సిబ్బందే నిర్వహిస్తారని, దానితో యూఎన్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ రెండు ఘటనలను వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించింది. ఎస్కలేటర్ ఆగిపోవడం యాదృచ్చికం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఇది అధ్యక్షుడి గౌరవానికి సంబంధించిన విషయం. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాలి అని కరోలిన్ లీవిట్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. కొందరు దీన్ని సాధారణ సాంకేతిక లోపంగా భావిస్తుండగా, మరికొందరు ట్రంప్‌కు ఉద్దేశపూర్వకంగా అవమానం కలిగించే ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. ఈ వివాదం ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా అమెరికా-యూఎన్ మధ్య సంబంధాలపై చర్చను రేకెత్తించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *