Tirumala: తిరుమలలో భక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రేపటి నుండి అధికారికంగా మొదలయ్యే ఈ ఉత్సవాలకు ముందు భాగంగా, ఈ రోజు సాయంత్రం అంకురార్పణ ఘట్టం వైఖానస ఆగమ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించబడనుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శుభారంభం కానుంది.
మేదినిపూజ ప్రాముఖ్యత
అంకురార్పణకు ముందు మేదినిపూజ నిర్వహించడం సంప్రదాయం. పుట్టమన్ను (మట్టిని) పవిత్రం చేసుకోవడానికి, భూదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తం పారాయణం చేస్తారు.
అంకురార్పణ ప్రక్రియ
వైఖానస ఆగమంలోని క్రతువులలో అంకురార్పణ అత్యంత ముఖ్యమైనది. ఈ క్రమంలో మట్టికుండల్లో పుట్టమన్ను నింపి, నవగ్రహాలను సూచించే నవధాన్యాలను వేసి మొలకలు పెంచుతారు.
-
సూర్యుడు – గోధుమలు
-
చంద్రుడు – బియ్యం
-
కుజుడు – కందులు
-
బుధుడు – పెసలు
-
బృహస్పతి – శనగలు
-
శుక్రుడు – అలసందలు
-
శనైశ్చరుడు – నువ్వులు
-
రాహువు – మినుములు
-
కేతువు – ఉలవలు
ఈ విత్తనాలు చిగురించడం సమస్త భూమండలం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని సంకేతం. ఈ సందర్భంగా ఓషధీసూక్తం పఠించబడుతుంది. అంతేకాదు, యాగశాలలో అష్టదిక్పాలకులు సహా మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: నేడు మేడారంలో సీఎం పర్యటన.. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సేనాధిపతి ఉత్సవం
అంకురార్పణతో పాటు శ్రీ విష్వక్సేనులవారి ఊరేగింపు కూడా ప్రత్యేకత. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఆయనను ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ సవ్యంగా సాగేందుకు సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారే పర్యవేక్షిస్తారని పురాణాల్లో ప్రాశస్త్యం ఉంది.
అక్షతారోపణ ఘట్టం
ఈ కుండల్లో మొలకెత్తిన ధాన్యాలను తొమ్మిది రోజుల పాటు పెంచి, చివరి రోజున స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత బలంగా చిగురిస్తే, బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా, శ్రేయస్సుతో జరుగుతాయని భక్తుల విశ్వాసం.