Thummala Nageswara Rao: వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలను ‘నట్టేట ముంచిన’ పార్టీ బీజేపీయేనని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి పతనం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సామాజిక న్యాయం కోసం తాము ఎంతకైనా పోరాడి, బీజేపీ మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తామని తుమ్మల స్పష్టం చేశారు.
సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమయితో కలిసి బీసీ బంద్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. పాత సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో ఆయన ప్రజలతో కలిసి నడిచారు.
“సామాజిక న్యాయం కోసం రాహుల్ పోరాటం”
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ… “దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. బీసీల కోసం సామాజిక విప్లవాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం కోసమే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ గణన చేపట్టారు” అని తెలిపారు.
“మోడీకి ఒక న్యాయం, రాష్ట్రాలకు ఒక న్యాయమా?”
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ వైఖరిని తుమ్మల తప్పుపట్టారు. “చట్టసభల్లో ఆమోదం తెలిపినా కూడా, సాంకేతిక కారణాలు చూపి బీజేపీ ప్రభుత్వం అడ్డు తిరుగుతోంది. ప్రజల క్షేత్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి తీరుతాం. గుజరాత్లో బీసీ రిజర్వేషన్ ద్వారానే నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి పదవి దక్కించుకున్నారు. మరి తెలంగాణకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు అడ్డుపడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
చట్టబద్ధంగా చేసిన సవరణలను చూసి, తెలంగాణకు బీసీ రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలని ప్రధాని మోడీని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.
“బీజేపీ భూస్థాపితం అవుతుంది”
“బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ. అందుకే రాబోయే రోజుల్లో బీజేపీ తప్పక ఓడిపోతుంది” అని తుమ్మల ఘాటుగా విమర్శించారు. నేడు జరిగిన బంద్‌ను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, “ఈ బంద్‌లో బీజేపీ జెండాలు తప్ప అన్ని పార్టీల జెండాలూ కనబడుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
“రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ భూ స్థాపితం కానుంది” అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ వ్యాఖ్యలను ముగించారు.