AFG vs PAK: దౌర్జన్యాలు, సరిహద్దు ఉద్రిక్తతలు పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. ఇటీవల భారత్‌తో సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమైన పాక్, ఇప్పుడు తన పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ తాజా దాడిలో అమాయక పౌరులతో పాటు ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ దేశవాళీ క్రికెటర్లు మరణించడం కలకలం సృష్టించింది.
వైమానిక దాడిలో 8 మంది మృతి
పాకిస్థాన్ సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు పాక్టికా ప్రావిన్స్పై జరిపిన వైమానిక దాడుల్లో (Air Strikes) మొత్తం 8 మంది పౌరులు మరణించారు, మరో 7 మంది గాయపడ్డారు. ఈ మృతులలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ధృవీకరించింది. పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిపై ఏసీబీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
మరణించిన క్రికెటర్లు:
కబీర్ అఘా (Kabir Agha)
సిబ్గుతుల్లా (Sibghatullah)
హరూన్ (Haroon)
ఈ ముగ్గురు క్రికెటర్లు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందినవారు. వీరు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు పాక్టికా రాజధాని శరణకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Also Read: ICC Awards: అభిషేక్ శర్మ, స్మృతి మంధానలకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు
ముక్కోణపు సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ వైదొలుగుదల
ఈ దాడి ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగబోయే ముక్కోణపు టీ20 సిరీస్ (Tri-Nation T20 Series) నుంచి తప్పుకుంటున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు కూడా పాల్గొనాల్సి ఉంది.
“ఈ దారుణ దాడిలో ముగ్గురు క్రికెటర్లను కోల్పోవడం ఆఫ్ఘన్ అథ్లెట్, క్రికెటింగ్ కుటుంబానికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో, సిరీస్‌లో పాకిస్థాన్ కూడా ఉండటం వలన, మేము ఈ ట్రై-నేషన్ సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాము,” అని ఏసీబీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ పోస్ట్ చేసింది.
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాతే దాడులు
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య డ్యూరాండ్ రేఖ వెంబడి ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి ఇరు దేశాలు పరస్పరం అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ వైమానిక దాడులకు తెగబడటం పాక్ వక్రబుద్ధికి నిదర్శనంగా ఆఫ్ఘన్ మీడియా అభివర్ణించింది. తాలిబాన్ వర్గాల ప్రకారం, ఈ దాడులు పాక్టికా ప్రావిన్స్‌లోని అర్గున్ మరియు బెర్మల్ జిల్లాల్లోని అనేక ఇళ్లపై జరిగాయి.
పాకిస్థాన్ చర్యలు సరిహద్దులో తీవ్ర నష్టాన్ని, అస్థిరతను సృష్టిస్తున్నాయి. ఈ దాడి కారణంగా ముగ్గురు యువ క్రికెటర్లతో సహా అమాయక పౌరుల ప్రాణాలు పోవడం క్రీడా ప్రపంచాన్ని కూడా విషాదంలో ముంచింది. గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ఏసీబీ ప్రార్థించింది.