Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం ఆగస్టు 29 , 30 తేదీలలో జరుగుతుంది. ప్రధానమంత్రిగా మోదీ జపాన్‌ను సందర్శించడం ఇది ఎనిమిదోసారి. అయితే, ప్రధాని ఇషిబాతో ఆయనకు ఇదే మొదటి శిఖరాగ్ర సమావేశం.ఇరు దేశాలు ఆర్థిక భద్రతను పటిష్టం చేసుకోవడానికి ఒక కొత్త కార్యాచరణ ప్రణాళికపై ఒప్పందం చేసుకోనున్నాయి.
ఇందులో సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, కమ్యూనికేషన్లు, క్లీన్ ఎనర్జీ , ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడంపై దృష్టి పెడతారు. జపాన్ ప్రభుత్వం రాబోయే పదేళ్లలో భారతదేశంలో 10 ట్రిలియన్ యెన్‌లు (సుమారు ₹5.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడులు ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, టెలికమ్యూనికేషన్లు, కెమికల్స్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో రానున్నాయి.
Also Read: Kunamneni sambhasivarao: RTC కార్మికుల కోసం ఉద్యమాలకు సిద్ధం
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌తో పాటు భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులలో జపాన్ సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనలో మోదీ, ఇషిబా బుల్లెట్ రైలులో ప్రయాణించి సెమీకండక్టర్ యూనిట్‌ను సందర్శించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై కూడా చర్చలు జరుగుతాయి.
ముఖ్యంగా, ‘క్వాడ్’ కూటమిలో భాగమైన రెండు దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి తమ వ్యూహాలను సమీక్షించుకోనున్నాయి. దీనితో పాటుగా ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించుకోనున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.