AP News: చదువుకొని ఇంజనీర్లు కావాల్సిన విద్యార్థులు, సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో దొంగలుగా మారిన ఘటన బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి బుల్లెట్ ద్విచక్ర వాహనాల తాళాలు ఎలా తీయాలో నేర్చుకున్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అద్దంకి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుండి రూ. 25.20 లక్షల విలువైన 16 బుల్లెట్‌లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపిన వివరాల ప్రకారం, పల్లా సాయిరాం (అద్దంకి), నార్లగడ్డ గోవిందరాజు (పల్నాడు జిల్లా, రెంటచింతల), రాయపూడి వసంతకుమార్ (ప్రకాశం జిల్లా, దర్శి), అక్కల వెంకటసాయిరెడ్డి (కొత్తపట్నం), దివి వేణుగోపాల్ (జరుగుమల్లి), కోడెల పవన్‌కుమార్ (నెల్లూరు జిల్లా, కావలి), జీనేపల్లి నరేంద్రవర్మ (ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల) అనే ఏడుగురు విద్యార్థులు ఒంగోలు, కందుకూరులోని ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. వీరంతా ఒంగోలు వీఐపీ రోడ్డులో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
వ్యసనాలకు బానిసైన ఈ విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని దొంగతనాల బాట పట్టారు. సింగరకొండ తిరునాళ్ల నుండి ఈనాటి వరకు మొత్తం 17 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. అద్దంకిలో తొమ్మిది, చిలకలూరిపేటలో మూడు, జె.పంగులూరులో రెండు, నరసరావుపేట గ్రామీణ, మేదరమెట్ల, మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున బుల్లెట్ బైక్‌ల చోరీ కేసులు నమోదయ్యాయి.
ఒకే రకమైన బుల్లెట్‌లు అపహరణకు గురవుతుండటాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తీవ్రంగా పరిగణించారు. చీరాల డీఎస్పీ మొయిన్ సారథ్యంలో, అద్దంకి సీఐ సుబ్బరాజు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టవర్ డంప్ (సెల్ నంబర్లపై నిఘా) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.
Also Read: Macherla Lo Marpu: జూలకంఠి బ్రహ్మా రెడ్డి రాజకీయం ఊహాతీతం..
దొంగిలించిన ద్విచక్ర వాహనాలను అద్దంకి పట్టణ శివారులోని బ్రహ్మానందం కాలనీలో ఒక పాడుబడిన భవనం వద్ద దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బైక్‌లను అమ్ముకోవడానికి అద్దంకి వచ్చిన సమయంలో పోలీసులు దాడి చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో నిందితులు యూట్యూబ్‌లో వీడియోలు చూసి బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. బైక్‌పై కూర్చుని ఒక కాలుతో హ్యాండిల్‌ను బలంగా తంతే లాక్ ఊడిపోతుందని, ఆ తర్వాత హ్యాండిల్ కింద ఉన్న వైర్లను కత్తిరించి కలిపితే బండి స్టార్ట్ అవుతుందని యూట్యూబ్‌లో నేర్చుకున్నారని తెలిపారు. ఒకసారి విజయవంతంగా దొంగతనం చేయడంతో, వరుసగా బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు.
ఈ కేసును ఛేదించడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన చీరాల డీఎస్పీ, అద్దంకి సీఐలతో పాటు ఏఎస్సై వసంత, హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, పీసీలు బ్రహ్మయ్య, పి.బ్రహ్మయ్య, వెంకటగోపయ్యలకు ఎస్పీ తుషార్ డూడీ నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఉన్నత చదువులు చదువుతున్న యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి అడ్డదారులు తొక్కడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.