Vijayawada SAAP Office: విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ – SAAP) ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగగా.. క్రీడా ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించామని నిరూపించుకునేందుకు ఎంపికైన ఉపాధ్యాయులు సైతం ఎదురుదాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు, ఘర్షణ వాతావరణం నెలకొంది.
మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు..
తమ నియామకాలపై వస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తూ, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్, ఎండీలకు వినతిపత్రాలు సమర్పించేందుకు స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు శాప్ కార్యాలయానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శాప్ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారంటూ ఆరోపిస్తూ నిరసనకు దిగారు.
పోటాపోటీ నినాదాలు.. మా మెడల్స్, సర్టిఫికెట్లు ఒరిజినల్
వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలను స్పోర్ట్స్ కోటా టీచర్లు ముక్తకంఠంతో తిప్పికొట్టారు. తాము మైదానాల్లో రక్తం, చెమటోడ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి సాధించిన మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు.. ఆధారాలు లేకుండా బురదజల్లే వారికి మైదానంలోనే సమాధానం చెబుతాం, ఎవరికైనా అనుమానం ఉంటే మా అసలైన ధ్రువపత్రాలు పరిశీలించుకోవచ్చు అని టీచర్లు గట్టిగా హెచ్చరించారు.
పోలీసులతో తోపులాట – వాటర్ బాటిళ్లు విసిరిన వైకాపా శ్రేణులు..
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని శాప్ గేట్లను మూసివేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకోవడంతో పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులు పోలీసులను నెట్టివేస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగారు.
నిరసన తెలుపుతున్న స్పోర్ట్స్ టీచర్ల వైపు వైకాపా కార్యకర్తలు వాటర్ బాటిళ్లు విసిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అదనపు బలగాలు రంగంలోకి దిగి వైకాపా నాయకులను, కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం శాప్ ఎండీ భరణి నేరుగా నిరసన ప్రదేశానికి వచ్చి ఆందోళనలో ఉన్న స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులతో మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హతలను పరిశీలిస్తున్నామని, నిజమైన ప్రతిభావంతులకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసా ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.