Anand Mahindra

Anand Mahindra: లక్ష్మి తెగువకు సెల్యూట్ చేసిన ఆనంద్ మహీంద్రా..  చదువుకు పూర్తి సాయం చేస్తానని హామీ..

Anand Mahindra: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని గోపికపై హేమంత్ అనే ఉన్మాది పవర్ చైన్‌సాతో దాడి చేసిన భయానక ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రాణభయంతో అందరూ పరుగులు తీస్తుంటే, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్నేహితురాలిని రక్షించేందుకు ఎదురొడ్డి నిలిచిన తోటి విద్యార్థిని లక్ష్మి ప్రదర్శించిన తెగువ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించడంతో పాటు స్ఫూర్తినిచ్చింది. హంతకుడిని అడ్డుకునే క్రమంలో లక్ష్మి కూడా తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గోపికకు బెంగళూరులో ప్రధాన సర్జరీలు పూర్తి కాగా, లక్ష్మి కూడా కోలుకుంటోంది.

లక్ష్మి చూపిన అసాధారణ ధైర్యసాహసాలను ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వేనోళ్ల కొనియాడారు. “నిజమైన వీరులు ఎల్లప్పుడూ ప్రత్యేక దుస్తులు ధరించరు.. కొన్నిసార్లు స్కూల్ యూనిఫాంలోనూ కనిపిస్తారు” అంటూ ఆమె తెగువకు సెల్యూట్ చేశారు. కాగా, లక్ష్మి కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, వారు ఉంటున్న ఇల్లు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉందని ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై ఆనంద్ మహీంద్రా తక్షణమే మానవతా దృక్పథంతో స్పందించారు. ప్రాణాలకు తెగించి స్నేహితురాలిని కాపాడిన ఆ ధైర్యవంతురాలైన బాలిక భవిష్యత్ చదువులకు అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని తానే స్వయంగా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ బాలిక విద్య బాధ్యతను భుజానెత్తుకున్నందుకు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *