Telangana: మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణలోని 14 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేసుకుంటామని మహారాష్ట్ర చేసిన ప్రకటనపై ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాకు మహారాష్ట్రకు ఎలాంటి సంబంధం లేదు, మేము తెలంగాణలోనే ఉంటాము అని ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ గ్రామస్తులు స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా స్పందించారు. తమ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటు హక్కు అన్నీ తెలంగాణలోనే ఉన్నాయని, కాబట్టి మహారాష్ట్రకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా తెలంగాణలోనే జీవిస్తున్నామని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తమకు అలవాటయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. మహారాష్ట్రలో విలీనం కావడం వల్ల తమ దైనందిన జీవితం, గుర్తింపు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.