Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఇప్పుడు సుప్రీంకోర్టు స్పందనపై ఆధారపడి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేవలం నలుగురినే స్పీకర్ విచారించారు. ఇంకా ఆరుగురు మిగిలే ఉన్నారు.
Telangana: ఈ దశలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 8 వారాల గడువు ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సుప్రీంకోర్టును కోరారు. నలుగురిని విచారించామని, మరో ఆరుగురిని విచారించాల్సి ఉన్నదని, ఆ మేరకు గడువు కావాలంటూ ఆయన కోరారు. స్పీకర్ వినతిపై సుప్రీంకోర్టులో ఇంకా అడ్మిన్ కాలేదు. దీంతో ఉత్కంఠ నెలకొన్నది.
Telangana: ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మూడు నెలల సమయాన్ని వృథా చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిని విచారించకుండా కావాలనే సాకులు చూపుతున్నారని సుప్రీంకోర్టుకు నివేదించింది. అదనపు గడువు ఇవ్వకుండా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
Telangana: దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. అసెంబ్లీ స్పీకర్ వినతి మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 8 వారాల గడువు ఇస్తుందా? లేకుంటే సుప్రీంకోర్టుయే విచారణకు తీసుకొని, మహారాష్ట్ర తరహా తీర్పు ఇస్తుందా? అన్నది తేలాల్సి ఉన్నది. సుప్రీంస్పందనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తి నెలకొన్నది.

