Telangana Global Summit: తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ పటంపై సరికొత్తగా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సోమవారం (డిసెంబర్ 8) ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047లో వందేళ్లు పూర్తయ్యే నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే మహత్తర లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.
44 దేశాల ప్రతినిధులతో సదస్సు ప్రారంభం
భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు (సోమ, మంగళవారాల్లో) జరగనున్న ఈ సదస్సు కోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్రాంగణం, సృజనాత్మకత, డిజిటల్ సాంకేతికత మేళవింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులతో సహా సుమారు 2 వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీల యాజమాన్య బృందాలు పాల్గొనడం ఈ సదస్సు ప్రాధాన్యతను చాటుతోంది. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు రావడం విశేషం.
ఇది కూడా చదవండి: Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. మూడు విమానాలకు బెదిరింపు మెయిల్స్… హైఅలర్ట్!
నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో కలిసి ఈ మహత్తర సంబరాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ సదస్సుకు ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ఛైర్‌పర్సన్లు హాజరుకానున్నారు. గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, జి.మల్లికార్జునరావు, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ తదితరులు పాల్గొనే ప్రముఖులలో ఉన్నారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం
మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రజాపాలన లక్ష్యాలు, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే పూర్తి సహకారం గురించి వివరిస్తారు. అంతేకాకుండా, ‘విజన్ 2047 డాక్యుమెంట్’ లక్ష్యాలను మరియు ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను కూడా వివరించనున్నారు.
27 అంశాలపై మేధోమథనం: రోడ్ మ్యాప్ ఖరారు
రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో నాలుగు వేర్వేరు సమావేశ మందిరాల్లో ఏకకాలంలో మొత్తం 27 అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులు జరగనున్నాయి.
ప్రగతి, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన మరియు పారిశ్రామికాభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Venkatesh Prasad: వెంకటేష్ ప్రసాద్ కు కీలక పదవి
రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవృద్ధికి ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు వంటి అంశాలపై నిపుణులు దిశానిర్దేశం చేస్తారు.
విజన్ 2047 ఆవిష్కరణ & సాంస్కృతిక వైభవం
సదస్సు ముగింపు రోజైన మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనున్నారు. ఈ డాక్యుమెంట్ రాబోయే దశాబ్దాలలో తెలంగాణ అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది.
రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణీ నాట్యం, బోనాల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విదేశీ దౌత్య బృందం కోసం నాగార్జునసాగర్ వద్ద ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన ‘బుద్ధవనం’ పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
సదస్సు సజావుగా నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్‌లతో వార్‌రూంను ఏర్పాటు చేయడంతో పాటు, పకడ్బందీ పోలీసు భద్రత కల్పించారు.

