Telangana: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చిందని సమాచారం. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై కసరత్తును మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జనవరి నెలలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మూడు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీంతో పల్లెల్లో సందడి మొదలైంది.
Telangana: పంచాయతీరాజ్ చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతి మండలానికి ఐదు గ్రామ పంచాయతీలు (ఎంపీటీసీ) ఉండేలా నిబంధనను మార్చనున్నారు. ముగ్గురు పిల్లల నిబంధనపై పునరాలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలున్న వారికే పోటీ చేసే అర్హత ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఈ రెండు బిల్లులను డిసెంబర్ రెండో వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించే అవకాశం ఉన్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తున్నది.
Telangana: ఈ ఏడాది ఫిబ్రవరి నెలతోనే పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అనంతరం పర్సన్ ఇన్‌చార్జుల పాలనలో పల్లె పంచాయతీలు కొనసాగుతున్నాయి. జనవరి 14వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తర్వాత 21 రోజుల అనంతరం అంటే ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికలు కావడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నది. ఈ సారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Telangana: అదే విధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందేనని బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఆ మేరకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. కులగణన సర్వే కొనసాగుతున్నది. ఇటీవలే ఏర్పాటైన బీసీ డెడికేటెడ్ కమిషన్ విచారణ కూడా సాగుతున్నది. వాటి గడువు తర్వాత బీసీల రిజర్వేషన్ల అంశం తేలితేనే ఎన్నికలు జరపాల్సి ఉన్నది. సకాలంలో పూర్తికాకపోతే ఎన్నికలు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.