bandi bhageerath

Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు!

Bandi Bhageerath: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో (POCSO) కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారంలో రోజుకో కొత్త మలుపు ఎదురవుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్‌పై పోలీసులు తాజాగా మరో కొత్త సెక్షన్‌ను అదనంగా చేర్చారు. కేసులోని కీలకమైన డిజిటల్ ఆధారాలను, అంతకుముందు తను వాడిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను భగీరథ్ మాయం చేసినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. సాక్ష్యాలను పనిగట్టుకుని రూపుమాపినందుకు గాను అతనిపై ‘బిఎన్ఎస్ 238’ సెక్షన్‌ను అదనంగా జోడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే అన్ని ఆధారాలు తుడిచేసి, ఆ తర్వాతే భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడనే ప్రచారం జరుగుతోంది.

మొదట్లో చిన్న సెక్షన్లు.. డీసీపీ ఎంట్రీతో సీన్ రివర్స్:
ఈ కేసు మొదలైన తొలిరోజుల్లో పోలీసులు భగీరథ్‌పై పెద్దగా తీవ్రత లేని బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని కొన్ని సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాటి ప్రకారం ఏడేళ్ల లోపే శిక్ష పడే అవకాశం ఉండటంతో, అరెస్టు భయం లేకుండా సులువుగా బయటపడొచ్చని భగీరథ్ భావించాడు. కానీ, ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిగా డీసీపీ రితిరాజ్ రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆమె ఈ నెల 12న ఈ కేసులో అత్యంత తీవ్రమైన నేరాల కింద పరిగణించే సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6 ను అదనంగా చేర్చారు. ఈ సెక్షన్లు పడటంతో నిందితుడికి అసలు బెయిల్ కూడా దొరకని పరిస్థితి ఎదురైంది.

తొమ్మిది రోజుల అజ్ఞాతం.. ఆపై లొంగుబాటు:
తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసి మే 13న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తనకు రెండు రోజులు టైమ్ కావాలని పోలీసులకు ఈ-మెయిల్ పంపి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన మే 8వ తేదీ నుండి మే 16 వరకు.. దాదాపు 9 రోజుల పాటు రహస్య ప్రదేశంలో ఉన్న భగీరథ్, చట్టపరమైన లొసుగుల నుంచి ఎలా తప్పించుకోవాలో న్యాయ నిపుణులతో కలిసి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఫోన్లు, సిమ్ కార్డులు మార్చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్నేహితుల కోసం గాలింపు.. సమాధానం దాటవేసిన తండ్రి బండి సంజయ్:
మరోవైపు ఈ కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్‌కు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండే కొందరు యువకులు కూడా కనిపించకుండా పోయారు. వారు దేశంలోనే ఉన్నారా లేక విదేశాలకు పారిపోయారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కాగా, ఈ కేసులో మీ అబ్బాయి అరెస్ట్ అవ్వడంపై మీ సమాధానం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ విషయాన్ని దాటవేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. అయితే, కన్నకొడుకు తప్పు చేస్తే తానే స్వయంగా పోలీసులకు అప్పగించిన తండ్రి ఎక్కడైనా ఉంటాడా? అని ఆయన ప్రశ్నించారు. తనపై వస్తున్న రాజకీయ దుష్ప్రచారాలను నమ్మవద్దని బండి సంజయ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *