Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా ప్రభుత్వం చేతికే.. డెడ్‌లైన్ ఎప్పుడంటే!

Hyderabad Metro: హైదరాబాద్ నగర ప్రజలకు అత్యంత ముఖ్యమైన రవాణా మార్గమైన మెట్రో రైలు నిర్వహణ ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి రానుంది. ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ (L&T) సంస్థ నుంచి బాధ్యతలను స్వీకరించడానికి ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఈ మొత్తం ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఒక డెడ్‌లైన్ పెట్టుకుంది.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం, అప్పుల భారం పెరగడంతో మెట్రోను నడపడం ఎల్‌ అండ్‌ టీ సంస్థకు కష్టంగా మారింది. దీంతో కొంతకాలంగా ఆ సంస్థ మెట్రోను ప్రభుత్వానికి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. నష్టాలతో సేవలు కొనసాగించలేమని ఎల్‌ అండ్‌ టీ కోరింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కూడా మెట్రో నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

మెట్రోను ప్రభుత్వమే నడపడం అనేది భారమైనప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా ఇది తప్పనిసరి. అంతేకాకుండా, మెట్రో సేవలను మరింతగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 8 కొత్త మార్గాల్లో మెట్రో విస్తరణ కోసం ప్రతిపాదనలను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ విస్తరణ అనుమతులపై మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

కేంద్ర మంత్రి ప్రకటనతో మార్చిలోపు అనుమతులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో, కేంద్రం నుండి ఆర్థిక సహాయం తీసుకుని మెట్రో విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెట్రో విస్తరణ అనుమతి వచ్చేలోపే, ఎల్‌ అండ్‌ టీ సంస్థ నుంచి పూర్తి బాధ్యత తీసుకోవడం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. అందుకే, ఈ పనిని ఆలస్యం చేయకుండా మార్చి 31 డెడ్‌లైన్ పెట్టుకుని యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *