BC Reservations

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకు

BC Reservations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వేడెక్కాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించింది.

ఇటీవల హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టం చేస్తూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను నిలిపివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి తదితరులు జూమ్‌ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు.

చర్చల అనంతరం, హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీఓ 9 అమలుకు న్యాయపరమైన మార్గం ద్వారా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ సూచించినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: Amir Khan Muttaqi: ఇండియా గడ్డపై నుంచి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్

“బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. సామాజిక న్యాయం కోసం, బీసీల హక్కుల కోసం ప్రభుత్వం వెనుకడుగు వేయదు” అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మాత్రం హైకోర్టు తీర్పు ఆధారంగా క్లారిటీ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా పాత విధానంలోనే ఎన్నికలు జరపొచ్చని హైకోర్టు సూచించినప్పటికీ, బీసీల రిజర్వేషన్‌ కోణంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు.

మరోవైపు, ఈ అంశంపై త్వరలోనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు సమయంపై, ఎన్నికల నిర్వహణపై, రిజర్వేషన్‌ నిష్పత్తులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

మొత్తం మీద, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రేవంత్ సర్కార్‌ నిర్ణయం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించింది. ఎన్నికల దిశలో ప్రభుత్వం తీసుకునే తదుపరి అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *