Womens Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టుక 20వ శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాలు, సోషలిస్ట్ ఉద్యమాలతో పెరిగింది. 1909లో అమెరికాలో సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో క్లారా జెట్‌కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 1911లో మార్చి 19న తొలిసారి అనేక యూరోపియన్ దేశాల్లో జరుపుకున్నారు. రష్యాలో 1917లో మహిళలు “ఆహారం, శాంతి” కోసం సమ్మె చేయడంతో ఈ సంఘటన విప్లవానికి దోహదపడింది. అలా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా స్థిరపడింది.
భారతదేశంలో సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహిళా సంస్కర్తలు మహిళా విద్య, బాల్య వివాహాల నిర్మూలన, వితంతువుల అభివృద్ధికి కృషి చేశారు. ఐక్యరాజ్య సమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది.
ప్రపంచ జనాభా 810 కోట్లు ఉండగా, 49.70% మహిళలు. హాంకాంగ్ (54.92%), రష్యా (54.3%), లాట్వియా (54%) వంటి దేశాల్లో మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఖతార్ (28.48%), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (30.9%) వంటి దేశాల్లో తక్కువ శాతంలో మహిళలు ఉన్నారు. ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తాయి.
ఇది కూడా చదవండి: Womens Health Tips: 30 ఏళ్లు పైబడిన మహిళలు.. తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు
భారతదేశంలో మహిళల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నా, వేతన అసమానతలు, లింగ వివక్ష ఇంకా కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలు పెద్దఎత్తున చేరుకుంటున్నారు.
మహిళా దినోత్సవ ప్రాముఖ్యత:
- మహిళా సాధికారత, హక్కుల సాధనకు అవగాహన కల్పించడం.
- సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళల రంగాల్లో మహిళా విజయాలను గుర్తించడం.
- లింగ సమానత్వం, మహిళలపై హింస నిర్మూలనపై దృష్టి పెట్టడం.
- మహిళలకు విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్థిరత్వం పెంపొందించేందుకు ప్రోత్సహించడం.
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం “Accelerate Action” అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలను వేగంగా అమలు చేయడమే లక్ష్యం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం వివిధ పథకాలను ప్రవేశపెడతాయి. కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు చర్చలు, ఆటలు, ఆరోగ్య శిబిరాలు, సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. స్త్రీ శక్తికి నివాళిగా ఈ దినోత్సవం జరుపుకోవాలి.