Telangana Cabinet: అక్టోబర్ 23వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికల నిర్వహణపై కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టుల తీర్పులపై చర్చిస్తారని తెలుస్తున్నది. ఇదే సమావేశంలో ఆయా అంశాలపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో9 జారీ చేసింది. దీనిపై హైకోర్టు స్టే విధించగా, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ఆయా పరిణామాలతో న్యాయపరమైన చర్చలు, ప్రత్యామ్నాయాలు, గత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అంశంపై ఈ క్యాబినెట్ భేటీలో చర్చిస్తారని అందరూ భావిస్తున్నారు. ఆయా అంశాలపై సంబంధిత అధికారులు న్యాయ నిపుణులతో జరిపిన సంప్రదింపుల వివరాలను క్యాబినెట్ కు సమర్పించే అవకాశం ఉన్నది.
Telangana Cabinet: ఈ నేపథ్యంలో సర్కారు ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారం.. ఎన్నికలకు వెళ్తే.. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దామని ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేయవచ్చు. ఎన్నికలపై హైకోర్టు నుంచి న్యాయపరమైన చిక్కులూ తప్పుతాయి. కానీ, బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకుండా ఉండాలంటే కోర్టుల నుంచి స్పష్టమైన తీర్పులు వచ్చేదాకా ఆగి, 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలా? అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.