Tejasvi yadav: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ బిల్లుతో తీవ్రమైన నేరారోపణల కింద ఉన్న ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు 30 రోజుల్లోగా తమ పదవులకు రాజీనామా చేయాలి, లేకపోతే వారిని బలవంతంగా తొలగించవచ్చు అనే నిబంధనను ప్రతిపాదించారు.
ఈ బిల్లును బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
తేజస్వి యాదవ్ ఆరోపణలు
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ బిల్లు వెనుక కేంద్రంలోని పెద్ద కుట్ర దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ మద్దతుతోనే అధికారంలో కొనసాగుతోందని, భవిష్యత్తులో చంద్రబాబు, నితీశ్‌లాంటి కీలక మిత్రపక్ష నేతలను బెదిరించి తమ అదుపులో ఉంచుకోవడానికే ఈ చట్టం తెచ్చారని ఆయన విమర్శించారు.
“దేశాభివృద్ధి కోసం కాకుండా, విధ్వంసకర రాజకీయ వ్యూహాలకే కేంద్రం ఈ చట్టాన్ని వాడుకుంటోంది. అవసరమైతే కొత్త కేసులు బనాయించి, నేతలను బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా వెనుకాడదు” అని తేజస్వి మండిపడ్డారు.
ఇప్పటికే కేసులతో ఇబ్బందులు
ఇప్పటికే ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను జైలుకు పంపిన కేంద్రం, ఇప్పుడు కొత్త చట్టం ద్వారా చంద్రబాబు, నితీశ్‌లాంటి నేతలపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తోంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాల ఆగ్రహం
ఈ బిల్లు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని, తమకు నచ్చని నేతలను లక్ష్యంగా చేసుకునేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే” అంటూ వారు మండిపడుతున్నారు.