Chandrababu: నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు తారక రామారావు ఇప్పుడు హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఇవాళ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.
పూజా కార్యక్రమంలో విశిష్ట అతిథులు
ఈ ప్రారంభ వేడుకకు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరిలు హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరో, హీరోయిన్‌లపై క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “తండ్రి ఎన్టీఆర్ నటనతో ఎంత కీర్తి తెచ్చుకున్నారో, మనవడు తారక రామారావు కూడా అదే విధంగా ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆశిస్తున్నా” అని ఆకాంక్షించారు.
సీఎం చంద్రబాబు నాయుడి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా తారక రామారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తారక రామారావు సినీ రంగంలోకి అడుగుపెడుతున్న వేళ, ఆయనకు నా ఆల్ ది బెస్ట్. ఎన్టీఆర్ గొప్ప విజయాలు సాధించాలనే మనస్ఫూర్తి కొరుకుంటున్నాను,” అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్చారు.
తారక రామారావు స్పందన
ఈ సందర్భంగా తారక రామారావు మాట్లాడుతూ:
“మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకీరామ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను. కుటుంబ సభ్యులంతా ఈరోజు నా కోసం ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్మకం ఉంది. ప్రాజెక్ట్ ప్రకటన దశ నుంచే మిడియా ఎంతో ఆదరించింది. అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు.
ఎన్టీఆర్ వారసుడిగా అంచనాలు
తారక రామారావు సినీ రంగ ప్రవేశం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సినీరంగానికే ఒక బ్రాండ్‌గా నిలిచిన ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన హీరోగా తారక రామారావుపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాతో తాను ఏ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాల్సిందే.


