Annamalai: తమిళనాడు రాజకీయాలపై తిరిగి దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, టీవీకే పార్టీ అధ్యక్షుడు మరియు సినీ నటుడు విజయ్ను తీవ్రంగా విమర్శించారు.
విజయ్‌పై అన్నామలై ఫైర్
అన్నామలై మాట్లాడుతూ, విజయ్ ‘వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్’ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. “స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు. సినిమా షూటింగ్ మధ్యలో రాజకీయాలు చేస్తారా? నాటకాలు ఎవరు ఆడుతున్నారు?” అంటూ ఆయన ప్రశ్నించారు.
విజయ్ 50 ఏళ్లు వచ్చిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడా? 30 ఏళ్ల వయసులో ఎక్కడ ఉన్నాడు? అప్పట్లో ఏం చేశాడు?” అంటూ అన్నామలై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా..?
విజయ్ పార్టీపై ఆరోపణలు
అంతేకాదు, విజయ్ రాజకీయ పార్టీయైన టీవీకే నిజమైన ప్రతిపక్ష పార్టీ కాదని, అది డీఎంకేకు ‘B టీం’గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. “డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడానికి విజయ్ పార్టీ ఒక గేమ్ ప్లాన్ కింద పనిచేస్తోంది” అని అన్నామలై పేర్కొన్నారు. విజయ్ ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని, లేఖలు రాసి ప్రచారం చేసుకోవడం రాజకీయ నాయకుడికి సరైన విధానం కాదని సూచించారు.
స్టాలిన్‌పై కూడా విమర్శలు
అన్నామలై, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. “స్టాలిన్ ఏదో భయంతో బీజేపీపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈడీ దాడుల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆయన డ్రామాలు ఆడుతున్నారు” అని ఆరోపించారు. బడ్జెట్ డ్రామా, సింబల్ డ్రామా— ఇవన్నీ దృష్టి మరల్చే కార్యక్రమాలేనని అన్నామలై పేర్కొన్నారు.
మొత్తానికి, తమిళనాడులో రాజకీయ వేడి పెరిగిన వేళ, విజయ్ రాజకీయ ప్రవేశం, ఆయన పార్టీ లక్ష్యాలపై అన్నామలై తీవ్ర విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.