Supreme Court Of India: వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వీధి కుక్కల కాటు కేసులు పెరిగిపోతున్న వేళ మీడియాలో వచ్చిన కథనాలపై సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా కేసును స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణకు చేపట్టింది. నగరంలో వీధికుక్కలకు సరైన సొల్యూషన్‌ను సూచించింది.
Supreme Court Of India: ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలే దేశవ్యాప్త మెట్రోపాలిటన్ నగరాలకూ ఆదర్శం కానున్నాయి. అయితే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున మాత్రమే వాదనలు వింటామని, జంతు ప్రేమికులు, ఇతర సంస్థల నుంచి ఎలాంటి వాదనలను తాము వినబోమని సుప్రీంధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము ఈ ఆదేశాలను జారీ చేశామని తేల్చి చెప్పింది.
Supreme Court Of India: వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత అభిప్రాయాన్ని ధర్మాసనం తీసుకున్నది. అందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించినట్టు ఆయన వివరించారు. గతంలో వీధికుక్కల బెడదపై సుప్రీం తీర్పు వల్ల కొందరు జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడం వల్ల అది నిలిచిపోయిందని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. వీధి కుక్కల కాటు వల్ల ప్రజలకు వచ్చిన రేబిస్ వ్యాధితో చనిపోయిన వారి ప్రాణాలను ఆ జంతు ప్రేమికులందరూ కలిసి తీసుకురాగలరా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
వీధి కుక్కల బెడదకు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధాన ఆదేశాలు ఇవే
* ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక అధికార యంత్రాంగాలు కలిసి డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలి
* ఆ డాగ్ షెల్టర్లలో తగినంత సిబ్బందిని ఉంచి స్టెరిలైజేషన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియను సత్వరమే చేపట్టాలి.
* ఢిల్లీ నగరంలో కుక్కుల బెడద పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని, తక్షణ చర్యలకు ఆదేశం
* వీధి శునకాలను తరలించకుండా ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
* శిశువులు, చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లో వీధి కుక్కల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి.
* వీధి కుక్కల దత్తత తీసుకోవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వవద్దు.
* కుక్కకాటు కేసులను నివారించడానికి వారంలోపు ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలి.
* వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లకు వీధి కుక్కలను తరలించాలి.