Sudhanshu Pandey: బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ‘అనుపమా’ ఫేమ్ నటుడు సుధాన్షు పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్ ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు ఒక పాత్ర కోసం కాంప్రమైజ్ అవ్వమని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అయితే ఆ దర్శకుడు ఇప్పుడు ఈ లోకంలో లేరని, ఆయన గొప్ప ఫిల్మ్‌మేకర్ అని సుధాన్షు తెలిపారు. తాను ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించానని, ఎవరైనా బలవంతం చేస్తే తీవ్రంగా స్పందిస్తానని హెచ్చరించారు. “నా సూత్రాలను వదిలిపెట్టను. ఎవరి అహానికి లొంగి పనిచేయను. ఒకవేళ ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, చెంపదెబ్బ కొట్టడానికి కూడా వెనకాడను,” అని సుధాన్షు గట్టిగా చెప్పారు. ప్రస్తుతం ‘ది ట్రేటర్స్’ రియాలిటీ షోలో కనిపిస్తున్న ఆయన, బాలీవుడ్‌లో ఈ దురాచారం గురించి బహిరంగంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర చర్చకు దారితీశాయి.
