Team India: ధోనీ, కోహ్లి, రోహిత్, రహానె కెప్టెన్సీలో భారత్… పర్యాటక జట్లను చీల్చిచెండాడడం ఇప్పటిదాకా చూశాం. బంతితో చెలరేగి వికెట్ల పండగ చేసుకోవడం, బ్యాట్ తో వీరవిహారం చేసి టీమిండియా రికార్డులు క్రియేట్ చేయడాన్ని ఈ జనరేషన్ అంతా అస్వాదించింది. తొలి మ్యాచుల్లో తడబడినా కోలుకుని ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న సందర్భాలూ అనుభవమే. మరి మేటి జట్టుగా ఇంటా బయటా జైత్రయాత్ర సాగించిన టీమిండియా ఇంతగా ఎందుకు డీలాపడింది.
ఎప్పుడో 2012-13 సీజన్లో ఇంగ్లండ్ చేతిలో 1-2తో సొంతగడ్డపై కంగుతిన్న టీమిండియా ఆ తర్వాత చెలరేగింది. వరుసగా 18 సిరీస్ విజయాలు సాధించి ప్రపంచక్రికెట్లో సూపర్ పవర్ గా నిలిచింది. అలాంటి తరుణంలో లంకపై 0-2తో చిత్తుగా ఓడి భారత్ కు వచ్చిన న్యూజిలాండ్ ఇలాంటి షాక్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. 1955లో తొలి పర్యటనలో కివీస్ మనగడ్డపై రెండు టెస్టులు గెలిచింది. తర్వాత 1988లో చివరిగా టెస్టు మ్యాచ్ గెలిచింది. అలాంటి చరిత్రను తిరగరాశారు టామ్ లాథమ్ కెప్టెన్సీలోని న్యూజిలాండర్లు. బెంగళూరులో కేవలం 46 పరుగులకే టీమిండియాను పడగొట్టిన కివీస్, పుణెలో టీమిండియా స్పిన్ వ్యూహానికి చెక్ పెడుతూ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. గతంలో ఏ జట్టు సాధించిన ఫీట్ ను కివీస్ తన సొంత గడ్డపై ఆడుతున్న తరహాలో స్టయిల్గా అందుకుంది.
Team India: ఇప్పటికే సిరీస్ చేజార్చుకుని అపఖ్యాతి మూటగట్టుకున్న టీమిండియా యాజమాన్యం కచ్చితంగా లోపాలపై దృష్టి సారిస్తుంది. ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తుంది. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడకుండా టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరాలంటే ఇకపై ప్రతి టెస్టూ గెలవక తప్పని పరిస్థితి నెలకొంది. ముంబయి టెస్టు నుంచే ఆ కసరత్తు మొదలవుతుంది. ముందుగా టీమిండియా సీనియర్స్ తమ ఆటతీరును సమీక్షించుకోవాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న డిమాండ్ రోహిత్, కోహ్లి ఇద్దరూ వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాలని. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కాకున్నా కనీసం టెస్టుల నుంచైనా విరమించాలని. రెండో టెస్టులో కనీసం యశస్వి జైస్వాల్కు అండగా నిలిచినా, కివీస్ సవాలును మెరుగ్గా ఎదుర్కోగలిగేవారమన్న భావన ఫ్యాన్స్ లో ఉంది. 2005లో గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో సిరీస్ మధ్యలోనే టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీని తప్పించారు. అయితే బీసీసీఐ ఫ్యాన్స్ డిమాండ్కు తలొగ్గి ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. విమర్శల నుంచి తమకు మినహాయింపేమీ ఉండదని ఈ స్టార్ బ్యాటర్లిద్దరూ గమనించి, బాధ్యతగా టెస్టు ఫార్మట్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందేమో అర్థం చేసుకోవాలి.
Team India: ఈ సిరీస్ లో రెండు టెస్టుల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపించిన అంశం బ్యాటర్ల షాట్ సెలెక్షన్. బెంగళూరులో మబ్బులు కమ్మిన పరిస్థితుల్లో బ్యాటర్లు దారుణంగా ఆడారు. పరిస్థితులను అంచనా వేయకుండా పుణెలో అడ్డంగా బ్యాట్లు ఊపి వికెట్లు ఉదారంగా పారేసుకున్నారు. బెంగళూరులో మ్యాట్ హెన్రీ బౌలింగ్లో బాడీకి దూరంగా వెళ్తున్న బంతిని సర్ఫరాజ్ డ్రైవ్ చేసిన తీరు ఓ ఉదాహరణ మాత్రమే. అదే ఇన్నింగ్స్ లో జడేజా తాను ఎదుర్కొన్న ఆరో బంతినే అడ్డంగా పుల్ చేయడానికి యత్నించడమూ అంతే. ఇక పుణెలో రెండో రోజు ఆటలో కివీస్ 259 పరుగులను అధిగమించడానికి భారత్ చేసిన ప్రయత్నంలో బ్యాటర్ల షాట్ల ఎంపిక గురించి ఎంత చెప్పినా తక్కువే. వంద పరుగులకు పైగా వెనుకబడ్డ టీమిండియా నాలుగో ఇన్నింగ్స్ అద్భుతం చేస్తుందని ఆ టర్నింగ్ పిచ్ గురించి తెలిసిన వారెవరూ ఆశించరు.
Team India: వ్యూహాల పరంగా టీమిండియా దారుణంగా వెనుకబడింది. వర్షం నేపథ్యంలో బెంగళూరు టెస్టులో టాస్ గెలిచి సింపుల్గా బ్యాటింగ్ తీసుకోవడం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూశాం. కివీస్ పేస్ ట్రయో మ్యాట్ హెన్రీ, ఒరౌర్కే, టిమ్ సౌథీలు చెలరేగి టీమిండియాను చుట్టేశారు. ఇది రోహిత్ కెప్టెన్సీపైనే సందేహాలు రేకెత్తించింది. కివీస్ 7 వికెట్లకు 233 పరుగులు చేసిన తరుణంలో టిమ్ సౌథీని నిలదొక్కుకోకుండా బుమ్రాను ప్రయోగించలేదు. దీంతో సౌథీ 65 పరుగులు చేసి రచిన్ రవీంద్రతో కలిసి భారీ స్కోరుకు బాటలు వేయగలిగాడు. ఇక రోహిత్ డిఫెన్సివ్ ఫీల్డింగ్ సెటప్ ను సునీల్ గవాస్కర్ కూడా తప్పుపట్టడం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో, ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ బెస్ట్ కెప్టెన్ అనడంలో సందేహం లేదు. కానీ టెస్టు క్రికెట్లో అతని సారథ్యంపై 2022 నుంచీ సందేహాలే. తన రికార్డు ను సవరించుకోడానికి అతను మెరుగైన వ్యూహాలను రచించుకోవాల్సిన తరుణమిది. లాంగెస్ట్ ఫార్మాట్లో అటాకింగ్ లీడర్షిప్ కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.
Team India: న్యూజిలాండ్ పై ఓటమి తర్వాత అందరికీ వచ్చే సందేహం… అసలు టీమిండియా బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ ఆడడం వచ్చా అన్నది. కనీసం సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలచుకుని ఆడగలిగే సామర్థ్యముందా అనేది. మిచెల్ శాంట్నర్ ను రెండు ఇన్నింగ్సుల్లోనూ ఎదుర్కోలేని దుస్థితి టీమిండియాకు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న. బీసీసీఐ ఇటీవల కాంట్రాక్లు ప్లేయర్లందరూ సీనియర్లు సహా డొమెస్టిక్ సీజన్ ఆడాలని తేల్చిచెప్పింది. మరి దేశవాళీలో రోహిత్, కోహ్లిలు ఆడి ఎంతకాలమైంది? వీరితో పాటు అశ్విన్కు ఇటీవల దేశవాళీ క్రికెట్ ఆడకుండా మినహాయింపు ఇచ్చారు. ఇదే శాపమైందా? బోర్డు తన నిర్ణయాన్ని కచ్చితంగా అమలుపర్చాల్సిన సమయం వచ్చేసింది.
Team India: నవంబరులో స్వదేశంలో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు ఆసీస్ జట్టు సన్నద్ధమవుతోంది. తమ దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ లో అన్ని స్టేట్ టీమ్స్ పాల్గొనాల్సిందేనని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేస్ స్టార్ మిచెల్ స్టార్క్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సహా ఎవరికీ మినహాయింపు లేదు. టీమిండియా రెడ్ బాల్ క్రికెట్లో ఇదే తరహాలో విధానాలను రూపొందించుకుని పాటించాల్సి ఉంది. సచిల్ లాంటి దిగ్గజం కూడా 40 ఏళ్ల వయసులో 2013-14 డొమెస్టిక్ సీజన్లో హర్యానాపై రంజీ ఆడాడు. కోహ్లి చివరిసారిగా 2012లో ఆడితే, రోహిత్ చివరిసారి నాలుగేళ్ల క్రితం డొమెస్టిక్ ఆడాడు. వీరిద్దరి వైఫల్యానికి కారణం ఇదే.

