Stray Dogs: కాన్పూర్ శ్యామ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఒక భయానక సంఘటన స్థానికులను కలవరపరిచింది. ఆగస్టు 20న కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 21 ఏళ్ల బీబీఎ చివరి సంవత్సరం విద్యార్థిని వైష్ణవి సాహుపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖం, శరీరంపై తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఎలా జరిగింది దాడి?
సాక్షుల చెప్పిన వివరాల ప్రకారం.. శ్యామ్‌నగర్‌లో వీధికుక్కలు, కోతులు కొట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్న మూడు కుక్కలు ఒక్కసారిగా వైష్ణవిపైకి దూసుకొచ్చాయి. అవి మీదకి రావడంతో ఒక్క క్షణం షాక్ లో ఉండిపోయింది . వెంటనే కుక్కలు ఆమెను నేలపైకి లాక్కెళ్లి, ముఖం, ముక్కు, శరీరంపై పీక్కు తినేశాయి. కుడి చెంప రెండుగా చీలిపోయి, ముక్కుపై సహా అనేక కాట్ల గుర్తులు కనిపిస్తున్నాయి.
స్థానికులు కర్రలతో పరుగెత్తి కుక్కలను తరిమి, రక్తస్రావంతో ఉన్న వైష్ణవిని కాపాడారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కాన్షీరామ్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చెంపపై 17 కుట్లు వేశారు.
ఇది కూడా చదవండి: CM VS TDP MLAS: వైసీపీకి ఏ గతి పట్టిందో అప్పుడే మర్చిపోయారా?
కుటుంబం ఆవేదన
వైష్ణవి మామ అశుతోష్ మాట్లాడుతూ, “నా అన్నయ్య కుమార్తె ఇలాంటి దారుణానికి గురవడం మా కుటుంబాన్ని మానసికంగా కుంగదీసింది. ఆమె ఇప్పుడు తినడానికైనా, నోరు కదపడానికి కూడా ఇబ్బంది పడుతోంది. స్ట్రా సహాయంతోనే ద్రవాలు ఇస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ప్రశ్నలు
కుటుంబ సభ్యులు ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “వీధికుక్కలను పట్టుకుని షెల్టర్లలో ఉంచాలి. లేకపోతే ఇంకొకరి కూతురు లేదా కోడలు ఇలాంటి పరిస్థితికి గురికాకుండా చర్యలు తీసుకోవాలి” అని వారు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా చర్చ
వీధికుక్కలపై స్టెరిలైజేషన్, షెల్టర్‌లకు తరలింపు అంశాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఈ సంఘటన మరింత చర్చకు దారితీసింది. ప్రజల భద్రత, జంతు హక్కులు – ఈ రెండు మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.