Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి ఈనెల 12వ తేదీ వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ శ్రీవారు ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ వాహనాలపై తిరు మాడ వీధుల్లో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు స్వామి వారికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
వేడుకగా అంకురార్పణ:
Srivari Brahmotsavam 2024: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గురువారం సాయంత్రం వేడుకగా జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి అంకురార్పణ చేశారు.
ఈరోజు మీనలగ్నంలో అంటే సాయంత్రం 5:45 – 6:00 గంటల మధ్యలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడం ద్వారా ముల్లోకాల్లోని దేవతలను, అష్టదిక్పాలకులు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.
వాహన సేవలు..
Srivari Brahmotsavam 2024: బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వాహన సేవ నిర్వహిస్తారు. మలయప్పస్వామి వారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహన సేవ ఉంటుంది. అయితే, గరుడ వాహన సేవ మాత్రం సాయంత్రం 6:30కి ప్రారంభం అవుతుంది. రాత్రి 11 గంటల వరకూ జరుగుతుంది. మొదటి రోజు అయిన ఈరోజు అంటే శుక్రవారం, 04 అక్టోబర్ రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
ఇవి కూడా చదవండి :
Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే..