Sridhar babu: హెలికాప్టర్ వినియోగంపై మంత్రి వివరణ

Sridhar babu: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. “అధికారులు ఎవరైనా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. స్మితా సబర్వాల్‌పై మాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు,” అని ఆయన స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

అందాల పోటీలు – రాష్ట్ర ప్రతిష్ఠకు ప్రతిబింబం

రాష్ట్రంలో జరుగుతున్న అందాల పోటీలు, ఉద్యోగ సమస్యలతో ముడిపెట్టడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. “అందాల పోటీలు కేవలం సౌందర్య ప్రాతిపదికన కాకుండా, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు. ఇవి తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటేందుకు చేపడుతున్నాం,” అని వివరించారు.

కవిత వ్యాఖ్యలపై సమాధానం

కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలపై కూడా మంత్రి స్పందించారు. “కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయలేదంటే, అది రాజకీయ వ్యూహమే. బీఆర్ఎస్ ఎప్పటికీ మా రాజకీయ ప్రత్యర్థులే,” అని పేర్కొన్నారు.

ఉద్యోగుల రిటైర్మెంట్, ప్రయోజనాలపై స్పష్టత

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే అందించాల్సిన అవసరం ఉందనికే మార్పులు తీసుకువచ్చామని అన్నారు. “మా ప్రభుత్వానికి రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించే సత్తా ఉందో లేదో ప్రజలకు బాగా తెలుసు,” అని అన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందన

ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు చేసిన విమర్శల నేపథ్యంలో, మంత్రి స్పందిస్తూ – “మా సీఎం ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతారు. ఆ వ్యాఖ్యలను ఆవేదనగా పరిగణించాలి. ఉద్యోగుల డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. ఎన్నికల హామీలు ఇస్తున్నప్పుడు అన్ని విషయాలనూ పరిగణలోకి తీసుకున్నాం,” అని భరోసా ఇచ్చారు.

బీజేపీకి మంత్రి ప్రశ్న

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ నేతలు పదవులకు రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. అలాంటిది బీజేపీ నేతలే తమను పదవుల నుంచి దిగిపోవాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

హెలికాప్టర్ వినియోగంపై వివరణ

రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్ వినియోగిస్తున్నారని వస్తున్న విమర్శలపై కూడా మంత్రి స్పందించారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వమే హెలికాప్టర్ కొనుగోలు చేసింది. దూర ప్రాంతాలకు త్వరగా చేరుకోవడం, ఖర్చు తగ్గించడం కోసం అవసరమైనప్పుడు వినియోగించడం తప్పేమీ కాదు. అయితే, గత ప్రభుత్వం మాత్రం అడ్డగోలుగా ఖర్చు చేసింది,” అని ఆరోపించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *