Krishna District: పోలీస్ శాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తించిన కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్, హోంగార్డు 304 బీ. అజయ్ కుమార్‌పై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల ఎదుట అజయ్ కుమార్ అశ్లీల నృత్యాలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డు ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడంపై జిల్లా ఎస్పీ మండిపడ్డారు. ఈ వీడియోల గురించి వార్త నిజమని నిర్ధారణ కావడంతో, హోంగార్డు అజయ్ కుమార్‌ను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Minister Sandhyarani: ఏపీలో జాతీయ స్థాయి ఉత్సవాలు: ‘ఉద్భవ్-2025’
ఈ అసభ్యకర నృత్యాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బంది యొక్క ప్రవర్తన ఎప్పుడూ శాఖ యొక్క ప్రతిష్ఠను పెంచేలా ఉండాలి తప్ప, అప్రతిష్ఠకు గురి చేసే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఎలా అభినందిస్తామో, నిర్లక్ష్యంగా లేదా అనుచితంగా వ్యవహరిస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

