Sonu Sood: సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించినా నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆపద్బాంధవుడిగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 500 మంది పేద మహిళలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి వారికి పునర్జన్మను ప్రసాదించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ఆ మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపడమే కాకుండా, దేశంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు.
ఈ విజయం తన బృందం, వైద్యుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని తెలిపిన సోనూసూద్, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో వలస కూలీలను తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు చేర్చి ‘రియల్ హీరో’గా గుర్తింపు పొందిన ఆయన, అప్పటి నుండి విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో నిరంతరం సేవలు అందిస్తూనే ఉన్నారు.
Also Read: Rowdy Janardhan: రౌడీ జనార్ధన్ నుంచి సూపర్ అప్డేట్!
సేవా కార్యక్రమాలతో నిరంతరం వార్తల్లో ఉండే సోనూసూద్, 2025లో తన 52వ పుట్టినరోజును పురస్కరించుకుని 500 మంది వృద్ధుల కోసం అత్యాధునిక వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన చేస్తున్న ఈ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో ప్రతిష్టాత్మకమైన ‘హ్యూమానిటేరియన్ అవార్డు’ లభించింది. ప్రస్తుతం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌తో జతకట్టి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఒక నటుడిగానే కాకుండా సమాజంలో మార్పు తెచ్చే ఒక గొప్ప మానవతావాదిగా ఆయన చేస్తున్న సేవలను యావత్ దేశం కొనియాడుతోంది.

