Sivakarthikeyan: తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ‘అమరన్’. దేశంకోసం ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన, అశోక చక్ర పురస్కార గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీపావళి కానుకగా ఈ నెల 31న ఇది జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి నాయికగా నటించింది. ఇందులో మేజర్ ముకుంద్ పాత్రను పోషించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని శివ కార్తికేయన్ తెలిపారు. తన తండ్రి పోలీస్ అధికారి అని.. 21 సంవత్సరాలుగా ఆయన జ్ఞాపకాలతోనే తాను సాగుతున్నానని తెలిపాడు. పోలీస్ ఆఫీసర్ గా మా నాన్నగారు ఎలా ఉండేవారు, సహోద్యోగులతో ఎలా ప్రవర్తించేవారు అనేది గుర్తు చేసుకుని ఈ సినిమాలో నటించానని అన్నారు. తన తండ్రిలా ఉండేలానే తన కల ‘అమరన్’తో నెరవేరిందని శివ కార్తికేయన్ తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించామని అన్నారు.

