Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి తన సొంత పార్టీకే చురకలు విసిరారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, వివిధ అంశాలపై నిరసనలు తెలుపుతూ సృష్టిస్తున్న గందరగోళంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండడంతో సభా పనులు అంతరాయాలు ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో థరూర్ మాట్లాడుతూ, సమస్యలను చర్చించడానికి పార్లమెంట్ ఉన్నదని, గందరగోళం సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. “ప్రజలు మనల్ని ఎన్నుకున్నది వారి తరఫున మాట్లాడాలని, దేశ ప్రయోజనాలను కాపాడాలని. సభలో అరవడానికి మనం రాలేదు,” అని ఆయన స్పష్టం చేశారు. తాను ఇలాంటి అభిప్రాయాన్ని మొదటి నుంచే చెబుతున్నానని, తన పార్టీ నాయకులు సహా సోనియా గాంధీకి కూడా ఈ విషయం తెలిసిందేనని అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో ఒంటరిగా ఉన్నట్టే అనిపించినా, ప్రజలు తనను పార్లమెంటుకు పంపింది తెలివితేటలు ఉపయోగించి ప్రశ్నలు లేవనెట్టి, పరిష్కారాలు కోరేందుకు అని థరూర్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్లిపోవాలన్న మాటలు కూడా కొందరు నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయినా, థరూర్ తన ధోరణి మార్చకుండా, చర్చే ప్రజాస్వామ్యానికి ప్రాణం అనే తన అభిప్రాయాన్ని మరింత బలపరిచారు.

