Viral News

Viral News: సమోసా కి స్మార్ట్ వాచ్ ఇచ్చేశాడు.. జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అమానవీయ ఘటన

Viral News: జబల్‌పూర్ రైల్వే స్టేషన్ (Jabalpur Railway Station) అమానవీయ ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ఓ ప్రయాణికుడిపై రైల్వే స్టేషన్‌లోని సమోసా విక్రేత చేసిన జబర్దస్తీ, దౌర్జన్యం సోషల్ మీడియాలో కలకలం రేపింది. కేవలం సమోసాల కోసం ఒక మనిషి చేతి వాచ్‌నే బలవంతంగా లాక్కున్న ఈ ఘటన.. రైల్వే స్టేషన్లలోని ‘వెండర్ మాఫియా’ బరితెగింపును మరోసారి కళ్లకు కట్టింది.

రైలు కదిలినా వదల్లేదు!

వివరాల్లోకి వెళ్తే.. జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న సమయంలో ఓ ప్రయాణికుడు సమోసాలు కొనడానికి ఫ్లాట్‌పాంపై ఉన్న వ్యాపారి వద్దకు వెళ్లాడు. అయితే, ఇంతలోనే రైలు కదలడం మొదలైంది. దీంతో ఆ ప్రయాణికుడు సమోసాలు కొనకుండానే హడావుడిగా తిరిగి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు.

కానీ, ఆ సమోసాల వ్యాపారి అతడిని అంత తేలికగా వదల్లేదు. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని బలవంతంగా ఆపి, సమోసాలకు డబ్బు కట్టి కొనుగోలు చేస్తేనే వదిలిపెడతానని బెదిరించాడు. రైలు వేగం పుంజుకుంటున్నా, ప్రయాణికుడిని వెళ్లనివ్వకుండా దౌర్జన్యం చేశాడు.

ఆన్‌లైన్ పేమెంట్ ఫెయిల్.. వాచ్ లాగేసుకున్నాడు!

సమయం లేక, మరో దారి కనిపించక ఆ ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించేందుకు ప్రయత్నించాడు. అయితే, దురదృష్టవశాత్తు ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి కాలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ సమోసా వ్యాపారి.. ఏకంగా ఆ ప్రయాణికుడి చేతికి ఉన్న వాచ్‌ను బలవంతంగా లాక్కున్నాడు!

వాచ్ లాక్కున్న తర్వాత సమోసాలను ఇచ్చి, అతడిని వదిలేశాడు. దీంతో రైలును అందుకోవడానికి ఆ ప్రయాణికుడు పరుగులంకించుకున్నాడు. ఈ అమానవీయ దృశ్యం మొత్తం ఫ్లాట్‌పాంపై ఉన్న ఇతరులు, సిబ్బంది చూస్తున్నా.. ఎవరూ కూడా ఆ వ్యాపారిని ప్రశ్నించడానికి, బాధితుడికి సాయం చేయడానికి ముందుకు రాకపోవడం మరింత విచారకరం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో ఈ తరహా ‘వెండర్ మాఫియా’ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై స్పందించి, ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *