Adudam Andhra

Adudam Andhra: ‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్‌పై ప్రభుత్వానికి అందనున్న విజిలెన్స్ నివేదిక

Adudam Andhra: గత వైకాపా ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా కార్యక్రమంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. నిధుల వాడకంపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. డీజీపీ పరిశీలన అనంతరం ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.

విచారణలో వెల్లడైన అంశాలు:
నిధుల దుర్వినియోగం: ‘ఆడుదాం ఆంధ్రా’ కోసం కేటాయించిన రూ.125 కోట్ల నిధులలో సుమారు రూ.40 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నిధులు క్రీడా పరికరాల కొనుగోళ్లు, పోటీల నిర్వహణ, విజేతలకు బహుమతుల పంపిణీ వంటి వాటిలో అక్రమాలు జరిగినట్లు తేలింది.

నాసిరకం క్రీడా పరికరాలు: రూ.37.50 కోట్లతో కొనుగోలు చేసిన క్రీడా పరికరాలు నాసిరకంగా ఉన్నాయని విచారణలో వెల్లడైంది. క్రికెట్ బ్యాట్లు వెంటనే విరిగిపోవడంతో క్రీడాకారులు వాటి నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా టెండర్లు పిలిచి కొన్ని సంస్థల నుంచి పరికరాలను కొనుగోలు చేయడం కూడా అక్రమాలకు తావిచ్చిందని అధికారులు గుర్తించారు.

పోటీల నిర్వహణలో లోపాలు: చాలా జిల్లాల్లో ఆన్‌లైన్‌లో క్రీడాకారులు నమోదు చేసుకోకపోవడంతో, తూతూమంత్రంగా పోటీలు నిర్వహించారని, కొన్ని చోట్ల దారినపోయే వారిని కూడా పోటీల్లో చేర్చినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు.

బహుమతుల్లో అవినీతి: విజేతలకు నగదు బహుమతులు ఇచ్చే విషయంలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని తేలింది. వైసీపీ కార్యకర్తలకు, అధికారుల కుటుంబ సభ్యులకు, అనుచరులకు బహుమతులు ఇచ్చేశారని గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక క్రీడా అధికారి తన కుటుంబ సభ్యుల పేర్లను విజేతల జాబితాలో చేర్చినట్లు నివేదికలో ప్రస్తావించారు.

Also Read: Pawan Kalyan: పంచాయతీరాజ్‌ అధికారులతో పవన్‌ టెలికాన్ఫరెన్స్‌

ఈ అవకతవకల్లో అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్.కె.రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు మరికొందరు అధికారుల పాత్ర ఉందని విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కొత్త శాప్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించే ముందు కొన్ని కీలక ఫైళ్లను, వివరాలను కొందరు అధికారులు తొలగించినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు.

ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ఎమ్మెల్యేలు, శాప్ ఛైర్మన్ రవినాయుడు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ విచారణ జరిగింది. విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ  RCB: RCB లో చేరనున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లు

విశాఖపట్నంలో జరిగిన ముగింపు కార్యక్రమం కోసం చేసిన ఖర్చుపైనా సందేహాలు ఉన్నాయి. దీని కోసం రూ.2.70 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. క్రీడాకారులకు వసతి, భోజనం వంటి వాటిపై భారీగా నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నప్పటికీ, క్రీడాకారులు సరైన సౌకర్యాలు లేవని ఆందోళనలు వ్యక్తం చేశారు. వీవీఐపీలు, వీఐపీల కోసం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ నివేదికలో ఆరోపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *