Sarada Peetham: పెందుర్తిఎమ్మార్వో కార్యాలయంలో బి.వి.రామ్ మీడియాతో మాట్లాడుతూ.. శారదా పీఠం అక్రమాలపై మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుస్తానన్నారు. శారదా పీఠంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకూడదని తెలుగు శక్తి ప్రధాన ఉద్దేశం అన్నారు. అయితే శారదా పీఠం కేవలం వైసీపీ పీఠం అని వ్యాఖ్యానించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శారదా పీఠానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారని.. ప్రత్యేకంగా శారదా పీఠానికి వచ్చి స్వామీజీ ఆశీస్సులు పొందేవారన్నారు. తీరా అధికారం కోల్పోయిన తర్వాత శారదాపీఠం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. నిన్న విజయనగరం పర్యటన కోసం వచ్చిన వైయస్ జగన్ శారదా పీఠానికి రాకపోవడం అతని నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడంతో.. ఇప్పుడు ఆ వైసిపి నాయకులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ఏది ఏమనప్పటికీ శారదా పీఠం ఇప్పటికే భీమిలిలో భూములు కోల్పోయిందని, తిరుమలలో భూములు కోల్పోయిందని, ఇప్పుడు ఇక్కడ కూడా భూమిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రామ్ పేర్కొన్నారు.
