Sangareddy: తెలంగాణ రాష్ట్రాన్ని వరుస రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాలతో ఎందరో దుర్మరణం పాలవగా, ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు దహన ఘటనలో, చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మొత్తం 38 మంది దుర్మరణం పాలైన ఘటనను మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
Sangareddy: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన వారు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జగన్నాథపూర్‌కు చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60)గా గుర్తించారు.
Sangareddy: ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంతో వీరు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో వరుస ప్రమాద ఘటనలతో తెలంగాణలోని ఊరూరూ ఉలికిపాటుకు గురవుతున్నది.

