Holding Urine: మన శరీరం నుంచి సహజంగా బయటకు వెళ్లే చర్యల్లో ఒకటి మూత్ర విసర్జన. అయితే కొన్నిసార్లు పరిస్థితుల వల్ల, మరి కొన్నిసార్లు మనమే నిర్లక్ష్యంతో మూత్రాన్ని నిరోధిస్తుంటాం. ప్రయాణాల్లో, సమావేశాల్లో, టాయిలెట్ లభించకపోయినప్పుడు, లేదా బద్ధకంతో కూడిన అలవాటుతో చాలా మంది మూత్రాన్ని ఆపుతూ ఉంటారు. కానీ ఇది చిన్న విషయం కాదని, దీర్ఘకాలికంగా చూస్తే చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రాన్ని నిరోధించడం వల్ల కలిగే ప్రమాదాలు
-
కిడ్నీ సమస్యలు: మూత్రంలో నీటి తో పాటు యూరియా, క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. వాటిని ఎక్కువసేపు శరీరంలో నిల్వ చేయడం వల్ల, క్యాల్షియం కిడ్నీలో పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా ఇది కొనసాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
-
బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు: మూత్రాశయంలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఇది అధికంగా కనిపిస్తుంది.
-
పల్విక్ కండరాల బలహీనత: మూత్రాశయాన్ని నియంత్రించే కండరాలపై నిరంతరం ఒత్తిడి పెరిగితే, అవి బలహీనపడతాయి. దీని ప్రభావం లైంగిక ఆరోగ్యంపై కూడా పడుతుంది.
-
మెదడు పనితీరు: శరీరం పంపే సహజ సంకేతాలను మనం నిర్లక్ష్యం చేస్తే, మెదడు వాటిని గుర్తించడంలో తడబడుతుంది. ఇది నర్వస్ సిస్టమ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు.
-
ప్రోస్టేట్, పైల్స్ వంటి సమస్యలు: సర్వేలు చెబుతున్నట్టు, మూత్రాన్ని ఎక్కువసేపు నియంత్రించే వ్యక్తుల్లో 15 శాతం మందికి ప్రోస్టేట్, మూత్రపిండాల సమస్యలు, పైల్స్ వంటి వ్యాధులు ఉన్నాయని వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Blue Tea: బ్లూ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
ప్రత్యేక జాగ్రత్తలు
-
పిల్లలు: ఏడాది లోపు పిల్లలు ప్రతి గంటకు ఒకసారి మూత్ర విసర్జన చేయడం సాధారణం. వారి మూత్రాశయం చిన్నగా ఉండటంతో ఎక్కువసార్లు టాయిలెట్ అవసరం అవుతుంది.
-
గర్భిణులు: గర్భధారణ సమయంలో మూత్రాశయం మీద ఒత్తిడి పెరగడం వల్ల, మూత్రం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరం సంకేతాలు ఇస్తే వెంటనే స్పందించడం మంచిది.
-
వయోజనులు: ఒక సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి రోజుకు కనీసం 6 సార్లు మూత్ర విసర్జన చేయాలి. ఇందుకోసం రోజూ తగినంత నీరు తీసుకోవాలి.
చివరగా.
మూత్రాన్ని నిర్లక్ష్యంగా ఆపడం ద్వారా కలిగే సమస్యలు తక్షణంగా కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంగా చూస్తే ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. శరీరం ఇచ్చే సంకేతాలను గౌరవించండి. అవసరమైతే, ప్రయాణాల్లో ముందుగానే సౌకర్యాలు చూసుకోవడం అలవాటుపడండి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీర అవసరాలను ఆలస్యించకుండా తీర్చడం తప్పనిసరి.