Nellore Aruna Nidigunta Arrested: నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ నేర కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై అతని ప్రియురాలు అరుణను కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో అరుణను అరెస్టు చేసి కోవూరుకు తరలించారు. ఒక ప్లాట్ యజమానిని బెదిరించిన కేసుతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల అరుణ, శ్రీకాంత్‌లకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌ను నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అరుణ కలిసిన వీడియోలు బయటకు రావడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. 2010లో హత్య కేసులో శిక్షపడిన శ్రీకాంత్ జైలు జీవితం కొనసాగిస్తూనే గ్యాంగ్‌ను బయట నుంచి నియంత్రిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 2014లో జైలు నుంచి తప్పించుకుని పారిపోయి, 2018లో మళ్లీ పట్టుబడిన అతను ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
అరుణపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. అద్దె ఇంటి యజమాని డబ్బులు ఇవ్వకుండా ఇల్లు లాక్కోవడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో పాటు, ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, నాలుగు రోజుల క్రితం ఓ సీఐకి హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తనపై తప్పుడు కేసులు మోపుతున్నారని, పోలీసులు గంజాయి పెట్టి ఇరికించే ప్రయత్నం చేశారని అరుణ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: Heavy Rains: మహారాష్ట్రలో వర్షాల బీభత్సం ముంబైకి ‘రెడ్ అలర్ట్’.. ప్రజలు అప్రమత్తం
ఈ వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరైన అంశంపై విచారణ జరుగుతోందని, పెరోల్ ఇవ్వడంలో ఎవరు సహకరించారన్న దానిపై స్పష్టత వచ్చిన తర్వాత ఎంతటి స్థాయి అధికారులైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాంత్ ఎస్కార్ట్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అరుణపై గతంలోనూ రెండు కేసులు ఉన్నట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. తన దగ్గరకు ఒక మహిళ వచ్చి భర్తకు పెరోల్ కోసం సిఫారసు చేయమని కోరినా తాను నిరాకరించానని చెప్పారు. తాను వేరే నియోజకవర్గానికి చెందిన విషయాల్లో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అరుణ అరెస్టుతో నెల్లూరులో రాజకీయ, పోలీసు వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ పెరోల్, అరుణ సంబంధాలు, ఉన్నతాధికారుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుండటంతో ఈ కేసు మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది.