Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగాయి. బలహీన వర్గాల (బీసీ) రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. విద్యా, ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం మా ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.
గవర్నర్ వద్ద ఆగిపోయిన బిల్లులు
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే రెండు రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందినప్పటికీ, గవర్నర్ వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపడంతో గత ఐదు నెలలుగా అవి పెండింగ్‌లో ఉన్నాయని సీఎం వెల్లడించారు. “తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును నిలిపివేయడం బీఆర్ఎస్ నేతల రాజకీయ చతురత. బలహీన వర్గాల హక్కులను అడ్డుకునే ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: PM Modi China Visit: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ..వాటిపైనే కీలక చర్చ
గుదిబండగా మారిన బీఆర్ఎస్ చట్టాలు
2018లో బీఆర్ఎస్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం, 2019లో మున్సిపల్ చట్టం 50 శాతం రిజర్వేషన్ పరిమితిని విధించడంతో బీసీలకు న్యాయం జరగలేదని సీఎం పేర్కొన్నారు. “ఈ చట్టాలు బలహీన వర్గాలకు అడ్డంకులుగా మారాయి. అందుకే మేము ఆర్డినెన్స్ తెచ్చాం. కానీ గవర్నర్ అమలు చేయకుండా రాష్ట్రపతికి పంపారు. ఇది బీఆర్ఎస్ నేతలే కల్పించిన అడ్డంకి” అని ఆయన విమర్శించారు.
ప్రతిపక్షంపై రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల అంశంలో సహకరించకపోవడాన్ని సీఎం తీవ్రంగా ఎద్దేవా చేశారు. “మీ నాయకుడు సభకు రాడం లేదు. ప్రజలు ఇప్పటికే మీ తప్పులకు తీర్పు చెప్పారు. ఇలాగే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా మీ చేతులమీద నుంచి జారిపోతుంది” అంటూ రేవంత్ హెచ్చరించారు.
డెడికేషన్ కమిషన్ ఏర్పాటు
బీసీల జనాభా గణాంకాలను సేకరించేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. “బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎదురైన న్యాయ సమస్యలు ఇక్కడ రాకూడదన్న ఉద్దేశంతో మేము పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాం. ఫిబ్రవరి 2024లో ప్రారంభించిన ఈ ప్రక్రియను కేవలం ఒకే సంవత్సరంలో పూర్తి చేసి చట్టబద్ధంగా ముందుకు తీసుకొచ్చాం” అని రేవంత్ వివరించారు.
బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం
“ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రిజర్వేషన్ల అంశంలో రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించేవారిని ప్రజలే బుద్ధి చెబుతారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుతో బలహీన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం మా లక్ష్యం” అని సీఎం స్పష్టం చేశారు.