Karnataka: లింగాయత్ పంచమసాలీల రిజర్వేషన్ డిమాండ్‌పై కర్ణాటకలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మంగళవారం బెంగళూరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆందోళనకారులు భద్రతా వలయాన్ని ఛేదించి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను తరిమికొట్టారు.
లాఠీచార్జిలో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బసవజయ్ మృత్యుంజయ్ స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న బూట్లు, చెప్పులు కనిపించాయి. చాలా మంది నిరసనకారుల తల నుండి రక్తం కారుతున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.
దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ మధ్య చర్చ మొదలైంది. కాంగ్రెస్ సాధువులను అవమానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, “మేము నిరసనకు వ్యతిరేకం కాదు. నేను ప్రతినిధులను చర్చకు పిలిచాను, కానీ వారు రాలేదు. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ అది “అది శాంతియుతంగా జరగాలి.” అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
పంచమసాలీ లింగాయత్ కమ్యూనిటీ ప్రస్తుతం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 5% రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇప్పుడు దాన్ని 15%కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంఘం నేతలతో సమావేశమై వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక కోసం వేచిచూడాలని కోరగా, నివేదిక ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి:No-Confidence Motion: రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు
స్వామికి మద్దతుగా జనం..
Karnataka: మంగళవారం ఉదయం బసవజయ్ మృత్యుంజయ స్వామి ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో పెద్దఎత్తున ఆందోళనకారులు తరలివచ్చారు. ఆయన నేతృత్వంలోని ఆందోళనకారులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాలతో పాటు ఎమ్మెల్యేల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏడీజీపీ ఆర్ హితేంద్ర లాఠీచార్జికి ఆదేశించారు.
పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొందరు ఆందోళనకారులు అందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు వారిపై మళ్ళీ లాఠీచార్జ్ చేశారు. దీంతో చాలా మంది నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి.