Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది ఎప్పటికీ సాధ్యం కాని ఒక కల అని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి తన ‘చిల్లర రాజకీయాలు’ మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇచ్చే సూచనలను స్వీకరించాలని హరీష్ రావు సూచించారు.
ఢిల్లీ పర్యటనపై క్లారిటీ.. లీకులపై మండిపాటు
తన ఢిల్లీ పర్యటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని హరీష్ రావు గట్టిగా ఖండించారు. పార్టీ పనుల కోసమే ఎంపీ రవిచంద్ర, వినోద్ కుమార్లతో కలిసి బహిరంగంగా ఢిల్లీ వెళ్లామని, ఇందులో దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా మీడియాకు కావాలనే లీకులు ఇస్తూ రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తాను ఢిల్లీకి వెళ్లానని, రహస్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డికి హెచ్చరిక
సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు విషయంలో రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రూ. 50 లక్షల నగదుతో దొరికిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, హోమ్ మంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తనను తాను రక్షించుకోవడానికి రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, అదే సమయంలో ప్రభుత్వం తరఫున మాత్రం నామమాత్రపు లాయర్లను పెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అయ్యామని, త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులు.. రాజ్యాంగ ఉల్లంఘన
రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుంటూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. మే 6న హైకోర్టులో జరగబోయే విచారణలో తమకే విజయం దక్కుతుందని, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా తాము ఎలాంటి తప్పు చేయలేదని, ధర్మం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు.
